మెదక్, జూలై 30(నమస్తే తెలంగాణ): మూడు, నాలుగు రోజుల నుంచి మెదక్ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వాననీటితో వాగులు, వంకలు, చెక్డ్యామ్ల్లోకి వరద వస్తున్నది. ఘనపూర్ ప్రాజెక్టు పొంగి పొర్లుతున్నది.గురువారం శంకరంపేట(ఏ) మండలంలో 23.8 మిల్లీమీటర్లు, రేగోడ్‌లో 26.2 ఎం.ఎం, అల్లాదుర్గంలో 16.8 ఎం.ఎం, టేక్మాల్‌లో 19.6 ఎం.ఎం, పాపన్నపేట 17.9 ఎం.ఎం, హవేళీఘనపూర్‌లో 20.8 ఎం.ఎం, రామాయంపేటలో 16.7 ఎం.ఎం, నిజాంపేటలో 55.5 ఎం.ఎం, చేగుంటలో 19.5 ఎం.ఎం, నార్సింగ్‌లో 22.8 ఎం.ఎం, శంకరంపేట(ఆర్)లో 14.7 ఎం.ఎం, మెదక్‌లో 44.2 ఎం.ఎం, కొల్చారంలో 16.2 ఎం.ఎం, చిలిపిచెడ్‌లో 6.0 ఎం.ఎం, కౌడిపల్లిలో 17.9 ఎం.ఎం, శివంపేటలో 24.8 ఎం.ఎం, వెల్ధుర్తిలో 20.0 ఎం.ఎం,తూప్రాన్‌లో 20.5 ఎం.ఎం, మనోహరాబాద్‌లో 17.3 ఎం.ఎం, మసాయిపేటలో 14.4 ఎం.ఎం వర్షపాతం నమోదైంది.
మెదక్ జిల్లా పాపన్నపేట, కొల్చారం మండలాల సరిహద్దుల్లోని ఘనపూర్ వనదుర్గా ప్రాజెక్టును ఎస్పీ డీవీ శ్రీనివాసరావు గురువారం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రాజెక్టు వద్ద ఎవరూ సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడానికి వెళ్లి ప్రాణాలు మీదకు తెచ్చుకోవద్దని ఆయన సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో బారికేడ్లు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. ఏడుపాయల ఆలయం, వనదుర్గా ప్రాజెక్టు పరిసరాల్లో వరద దగ్గర వద్ద భక్తులు, పర్యాటకులు, జీవాల పెంపకందారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట ఎస్బీ ఇన్స్పెక్టర్ సందీప్‌రెడ్డి, మెదక్ రూరల్ సీఐ కృష్ణమూర్తి, పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప సెలవులు పెట్టవద్దని అధికార యంత్రాంగాన్ని ఆమె ఆదేశించారు. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెదక్ కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 9391942254 నంబర్‌కు ఫోన్ చేయాలని కలెక్టర్ సూచించారు. గురువారం మెదక్ కలెక్టరేట్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులతో గూగుల్ మీట్ సమావేశం నిర్వహించి, యంత్రాంగానికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను రక్షించేందుకు రోప్స్, డ్రోన్స్, అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు.
అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల శుభ్రతపై దృష్టి సారించాలన్నారు. నీటి వనరుల వద్ద హెచ్చరిక బోర్టులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల్లో లీకేజీలు ఉంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న ఇండ్లలో ప్రజలు నివాసం ఉండకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. హవేళీఘనపూర్ మండలంలోని దూప్‌సింగ్ తండాకు వరద వస్తే, ప్రజలు రాకపోకలు ఇబ్బంది కలకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలనని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.