Indian Navy sailor : హనీట్రాప్‌లో చిక్కుకుని.. భారత రక్షణ శాఖకు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు అందజేసిన ఇండియన్ నేవీ అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నేవీ అధికారి పేరు ప్రదీప్ ముఖర్జీ. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వాడు. విశాఖపట్నంలోని ఈస్టర్న్ నావల్ కమాండ్‌లో నావికుడిగా పని చేస్తున్నాడు.
అతడు కోయంబత్తూరులోని ఐఎన్ఎస్ అగ్రానిలో ఒక కోర్సుకు సంబంధించి శిక్షణ తీసుకుంటుండగా పోలీసులు శనివారం అరెస్టు చేశారు. బెంగాల్‌కు చెందిన ప్రదీప్ 2014లో ఇండియన్ నేవీకి ఎంపికయ్యాడు. కొన్ని నెలలుగా అతడు హనీట్రాప్‌లో చిక్కుకున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ఒక మహిళతో సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. ఆ మహిళ పాకిస్తాన్ రహస్య ఏజెంట్. ఆమెతో పరిచయం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా భారత నేవీకి సంబంధించిన రహస్య సమాచారాన్ని ఆమెకు చేరవేస్తూ వచ్చాడు. నౌకల కదలికలు, నౌకల వివరాలు, వాటి పనితీరు, కార్యనిర్వహణ వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందించాడు.
కొంతకాలంగా అతడి కదలికలపై ఏపీ పోలీసులకు చెందిన కౌంటర్ ఇంటెలిజెన్స్ (సీఐ) నిఘా పెట్టింది. ఈ విభాగం తీవ్రవాదంతోపాటు సరిహద్దులో ఉగ్రవాదం వంటి అంశాలపై ప్రత్యేకంగా పనిచేస్తుంది. అతడి గురించి తగిన సమాచారం అందడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇంతకుముందు లాన్స్ నాయక్ ఆదర్శ్ కుమార్ అనే ఇండియన్ నేవీ అధికారి కూడా ఇలాగే అరెస్టైన సంగతి తెలిసిందే. అతడు కూడా భారత నేవీకి సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్ ఐఎస్ఐకి అందించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు.