Kusum pharma : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine war) గడిచిన ఐదేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఉక్రెయిన్‌లోని భారతీయ ఫార్మా కంపెనీ (Indian Pharma Company) పై భీకర దాడి జరిగింది. రష్యా ప్రయోగించిన డ్రోన్లు (Drones) సుమీ నగరంలోని ‘కుసుమ్ గ్రూప్ (Kusum Group)స కు చెందిన ఫార్మా ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా పలువురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ఫార్మా ప్లాంట్‌లోని ప్రధాన నిర్మాణం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది. డ్రోన్ల దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగ కమ్ముకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దాడివల్ల సుమారు రూ.400 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రష్యాతో ఐదేళ్లుగా యుద్ధం జరుగుతున్నప్పటికీ ఉక్రెయిన్‌లోని ఈ ప్లాంట్ నిరంతరాయంగా ఉత్పత్తిని కొనసాగిస్తూనే ఉన్నది. తాజా దాడితో ప్లాంట్‌లో కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. భారతీయుడైన రాజీవ్ గుప్తా నేతృత్వంలో కుసుమ్ గ్రూప్ నడుస్తున్నది. ఈ సంస్థ 1994 లో భారతీయ ఔషధాలను ఉక్రెయిన్‌కు ఎగుమతిచేసే డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత సొంత బ్రాండ్లను మార్కెటింగ్ చేసింది. 2009లో సుమీ నగరంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించింది.
ఈ గ్రూప్ ఉక్రెయిన్, ఉజ్బెకిస్థాన్, కజకిస్థాన్ వంటి 9కి పైగా దేశాలకు 50 రకాల జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నది. గత కొంతకాలంగా రష్యా.. చవకైన, వేగవంతమైన షాహెద్ డ్రోన్లతో ఉక్రెయిన్‌పై నిరంతరం దాడులు చేస్తున్నది. ఈ డ్రోన్లను అడ్డుకోవడం ఉక్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ కూడా దేశీయంగా తయారుచేసిన ‘ఎఫ్పీ-7’ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించింది. దీని పరిధి సుమారు 250 కిలోమీటర్లు.