హైదరాబాద్: బాలాపూర్ గణేశుడి (Balapur Ganesh) పేరు వినగానే లడ్డూ వేలం టక్కున గుర్తొస్తుంది. అంతటి ప్రశస్తి గాంచిన బాలాపూర్ గణపయ్య లడ్డూ వేలం శనివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. పూజా కార్యక్రమం పూర్తవడంతో ఊరేగింపునకు లంబోదరుడు సిద్ధమయ్యాడు. ప్రత్యేకంగా అలంకరించిన ట్రాలీలో గ్రామ పురవీధుల్లో తిరుగూ బొడ్రాయి వద్దకు ఉదయం 8.30 గంటలకు చేరుకోనున్నాడు. అనంతరం లడ్డూ వేలం జరుగనుంది. గతేడాది రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలు పలికింది.
లడ్డూ కోసం స్థానికులు, స్థానికేతరుల మధ్య పోటీ ఏర్పడింది. ఈ ఏడాది వేలంలో 38 మంది పాల్గొంటున్నారు. రూ.5 చెల్లించి తమ పేరును నమోదుచేసున్నారు. ఉత్సవ కమిటీ నిబంధనల మేరకు వేలంలో పాల్గొననున్న సభ్యులు రూ.30.01 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లడ్డూ వేలం తర్వాత హుస్సేన్‌సాగర్ వైపు గణేశుడి శోభాయత్ర సాగనుంది. బాలాపూర్ నుంచి చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజేమార్కెట్, అబిడ్స్, లిబర్టీ చౌరస్తా మీదుగా హుస్సేన్‌సాగర్‌కు మొత్తం 16 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుంది.
1980లో బాలాపూర్ గణేశ్ ఉత్సవ సమితి ఏర్పాటయింది. గత 31 ఏండ్లుగా లడ్డూ వేలం కొనసాగుతున్నది. 1994లో తొలిసారిగా లడ్డూ వేలం ప్రారంభించారు. తొలి ఏడాది రూ.450 ధర పలికిన లడ్డూ.. 2017లో రూ.15 లక్షలు దాటింది. 2020లో కరోనా కారణంగా బాలాపూర్ లడ్డూ వేలంపాట రద్దయింది. 2024లో రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలు పలికింది. వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ఉత్సవ కమిటీ.. గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నది. కాగా, భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బాలాపూర్ గణేశుడికి చోటు దక్కింది.