Nag Ashwin |కేంద్ర ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్లపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.100లోపు టికెట్లపై 12% నుంచి 5%కు జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సినీ పరిశ్రమలో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక కీలక విజ్ఞప్తి చేశారు.సోషల్ మీడియా వేదికగా స్పందించిన నాగ్ అశ్విన్, జీఎస్టీ తగ్గింపును స్వాగతించారు. అయితే ₹100 ధరలోపు టికెట్లను విక్రయించే థియేటర్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ₹250లోపు టికెట్లకు కూడా 5% జీఎస్టీ వర్తించాలి అని ప్రధాని మోదీకి సూచించారు.
“జీఎస్టీ సంస్కరణలు స్వాగతించదగినవి సార్. కానీ ఈ రోజుల్లో ₹100 టికెట్లను విక్రయించే థియేటర్లు తక్కువ. పరిశ్రమ అభివృద్ధి, మధ్యతరగతి ప్రేక్షకులను ఆకర్షించడానికి ₹250లోపు టికెట్లపై 5% స్లాబ్ వర్తించాలి అని నాగ్ అశ్విన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. రూ.100 లోపు టికెట్లపై జీఎస్టీ తగ్గింపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు కొంత వరకు లాభపడే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ రేట్లు 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, అధిక ధరల టికెట్లు అమ్మే మల్టీప్లెక్స్ థియేటర్లు మాత్రం ఈ తగ్గింపులోకి రావడం లేదు. ₹100 దాటిన టికెట్లపై ఇప్పటికీ 18% జీఎస్టీ కొనసాగుతుంది.
జీఎస్టీ కౌన్సిల్ తాజాగా పాప్‌కార్న్ పై కూడ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. సాల్టెడ్ పాప్‌కార్న్ 5% జీఎస్టీ, క్యారమెల్ (షుగర్) పాప్‌కార్న్ 18% జీఎస్టీ. ఇక్కడ ప్యాకింగ్ చేసిన చేయకపోయిన జీఎస్టీ రేటు ఒకటే వర్తించనుంది. గతంలో ప్యాకేజింగ్ ఆధారంగా వేర్వేరు రేట్లు ఉండేవి. నాగ్ అశ్విన్ లాంటి ప్రముఖ దర్శకులు చేసిన సూచనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి. మధ్యతరగతి ప్రేక్షకులకు మరింత ఆర్థిక భారం లేకుండా సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పిస్తే, థియేటర్ కల్చర్ తిరిగి పుంజుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.