కన్నౌర్: సోషల్ మీడియాలో ప్రధాని మోదీ(PM Modi)ని దేశద్రోహి అని కామెంట్ చేసిన వ్యక్తిపై కేరళలో కేసు బుక్ చేశారు. శ్రీకందపురంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరుకు చెందిన నివాసి రాజన్ సీ కొత్తూరుపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీజేపీ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ కేసు పెట్టారు. అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం.. నిందిత వ్యక్తి మార్చి 3వ తేదీన ఫేస్బుక్లో ఓ పోస్టు చేశాడు. దాంట్లో అతను ప్రధాని మోదీని ఓ దేశద్రోహిగా ఆరోపించారు. అల్లర్లు జరగాలన్న నెపంతోనే నిందిత వ్యక్తి ప్రధాని మోదీపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 192 ప్రకారం కేసు రిజిస్టర్ చేశారు. కేరళ పోలీసు చట్టంలోని సెక్షన్ 120(0) ప్రకారం కూడా కేసు పెట్టారు. ఫిర్యాదు అందిన తర్వాత శుక్రవారం దర్యాప్తు చేపట్టామని పోలీసులు చెప్పారు.