– బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండలాధ్యక్షుడు కర్ర వెంకటయ్య
యాదగిరిగుట్ట, మార్చి 07 : యాదగిరిగుట్ట పట్టణంలో దాదాపుగా 800 ఇండ్లు, మండల వ్యాప్తంగా సుమారుగా 3 వేల ఇండ్లు నిషేధిత జాబితాలో పెట్టి పేదల జీవితాలతో ఆటలాడుకుంటుంటే ఏదో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాటలు చెప్పుకుని కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కర్ర వెంకటయ్య ఆరోపించారు. చేతనైతే నిషేధిత జాబితాను పూర్తిగా రద్దు చేసి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలోని వంగపల్లి గ్రామంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న పేదలకు సర్వ హక్కులు కల్పించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పేదలకు వారి ఇండ్లకు కనీసం హక్కు లేకుండా చేస్తున్నారన్నారు.
ఏదైనా ఆరోగ్య సమస్య, ఇంట్లో ఆడ పిల్లల పెండ్లీలకు ఇండ్లు విక్రయించడమో, బ్యాంక్లో తనఖా పెట్టి రుణం తీసుకునే వీలు లేకుండా చేస్తున్నారన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆస్తులను జప్తు చేసుకుని ధనికులకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. గుట్టలో పేదల ఇండ్ల జోలికి వస్తే జిల్లా అగ్ని గుండంగా మారుతుందని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వ తీరును మార్చుకోవాలన్నారు. లేకపోతే ఆమరణ నిరహార దీక్షకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బాధితుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్ కందాల అలివేలు రంగారెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు జహంగీర్, మాజీ ఎంపీటీసీ రేపాక మౌనిక పాల్గొన్నారు.