Samudra Manthan : భారత ప్రాదేశిక సముద్ర జలాల్లో చమురు అన్వేషణకు కేంద్రం మరింత ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందుకోసం ‘సముద్ర మంథన్’ పేరుతో కొత్త పథకాన్ని కేంద్రం అమలు చేయనుంది. ఈ పథకానికి తాజాగా కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. ‘సముద్ర మంథన్’ పథకాన్ని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తారు. ఈ పథకం కింద భారత్కు హక్కు కలిగిన సముద్ర జలాలు, తీర ప్రాంతాల్లో చమురు అన్వేషణ చేపడతారు.
దీని ద్వారా చమురు నిల్వల్ని గుర్తించి, వెలికి తీస్తారు. ఈ పథకాన్ని 2030-31 ఆర్థిక సంవత్సరం నుంచి అమలు చేస్తారు. ఇందుకోసం రూ.84,084 కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. ఇండియాకు చెందిన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ (ఈఈజడ్) పరిధిలో భారీగా చమురు నిల్వలు ఉన్నాయని అంచనా. ఆయిల్, గ్యాస్ నిల్వలు ఇక్కడ పెద్ద స్థాయిలో ఉన్నాయి. వీటిని నూతన పథకం ద్వారా వెలికి తీస్తారు. చమురు నిల్వల్ని గుర్తించి, వెలికి తీయడం, ఉత్పత్తి దీని ముఖ్య ఉద్దేశం. అలాగే, ప్రత్యేకంగా సంయుక్త చమురు, గ్యాస్ ఉత్పత్తి జోన్లను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఇండియాకు భారీగా మన జలాల నుంచే చమురు లభిస్తుంది. ఫలితంగా చమురు కోసం విదేశాలపై ఆధారపడే అవకాశం తగ్గుతుంది. విదేశాలకు భారత నిధుల్ని వెచ్చించే అవకాశం కూడా తగ్గుతుంది.
కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారం.. ‘సముద్ర మంథన్’ పథకం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిక్షేపాల్ని వెలికితీస్తారు. దీంతో మనకు చమురు భారీగా లభించడంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగవుతాయి. ప్రభుత్వం చేపట్టిన ఆత్మ నిర్భర భారత్ లక్ష్యం కూడా నెరవేరుతుందని కేంద్రం చెబుతోంది. భారత చమురు ఉత్పత్తి రంగానికి ఇది ఎంతో మేలు చేస్తుందని కేంద్రం భావిస్తోంది.