Bengaluru Woman : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. భర్తతో జరిగిన ఒక గొడవ భార్య ఆత్మహత్యకు దారి తీసింది. సాంబార్ విషయంలో ఇరువురి మధ్య మొదలైన వివాదం చివరకు విషాదంగా ముగిసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావ్య (27) అనే యువతికి, రంగస్వామి అనే వ్యక్తికి ఐదేళ్లక్రితం వివాహం జరిగింది. వీరు బెంగళూరులో ఉంటున్నారు. వీరికి నాలుగు నెలల చిన్నారి కూడా ఉంది.
కాగా, గురువారం కావ్య తన భర్తకు సాంబార్ వేడి చేసి వడ్డించింది. అయితే, ఆ సాంబార్ చేసి అప్పటికి మూడు రోజులు అవుతోంది. దీంతో మూడు రోజుల క్రితం చేసిన సాంబార్ ఎందుకు వడ్డించావని భర్త రంగస్వామి ప్రశ్నించాడు. భార్య కావ్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ అంశంపై ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. అది పెరిగి పెద్ద గొడవగా మారింది. కావ్యపై భర్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలాగే ఆమెపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఇరువురి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర వేదనకు గురైన కావ్య వెంటనే వ్యవసాయంలో వాడే పురుగుల మందు తాగింది. దీంతో కొంతసేపటికి ఆమె తీవ్రంగా వాంతులు చేసుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలోనే కావ్య ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కావ్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.