Rajkummar Rao – Patralekhaa| బాలీవుడ్ స్టార్ దంపతులు రాజ్‌కుమార్ రావు, పత్రలేఖ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ శుభవార్తను ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది ఈ జంట. దాదాపు 10 ఏండ్లు డేటింగ్లో ఉన్న వీరిద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన అనంతరం కెరీర్ పరంగా గ్యాప్ తీసుకున్న ఈ జంట త్వరలోనే పేరెంట్స్ అవ్వబోతున్నట్లు ప్రకటించింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయంలో తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి పత్రలేఖ.
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గోన్న పత్రలేఖ మాట్లాడుతూ.. తమకి ఎప్పుడు పిల్లలు కావాలనే దానిపై క్లారిటీ లేకపోవడంతో మూడేళ్ల క్రితం తన అండాలను ఫ్రీజ్(Egg freezing) చేయించుకున్నట్లు తెలిపింది. అయితే అండాలను ఫ్రీజ్ చేయించడం అనుకున్నంత సులభమైన పద్దతి కాదని దాని వలన కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయని పత్రలేఖ తెలిపింది. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియ ఎంత కష్టమో నా డాక్టర్ నాకు చెప్పలేదు. ఎగ్ ఫ్రీజింగ్ వలన నేను బరువు పెరగడమే కాకుండా మానసికంగా కుంగుబాటుకు లోనయ్యాను. అందుకే అండాలు ఫ్రీజ్ చేయించుకోవడం కంటే సహజంగా గర్భం దాల్చడం చాలా సులభమని తర్వాత తెలిసింది. ఇప్పుడున్న యువతకి ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవడం కంటే సహజంగా గర్భం దాల్చమని సలహా ఇస్తాను అంటూ పత్రలేఖ చెప్పుకోచ్చింది.
సినిమాల విషయానికి వస్తే.. పత్రలేఖ ఇటీవలే ఫూలే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. రాజ్ కుమార్ రావు మాలిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు.