హైదరాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): నీటిపారుదల శాఖ హైదరాబాద్ యూనిట్లో కొద్ది నెలల క్రితం ఇష్టారీతిన చేపట్టిన బదిలీల వ్యవహారంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నాడు ఎలాంటి విచారణలు లేకుండానే పలువురు ఇంజినీర్లను బదిలీ చేసిన ప్రభుత్వం ప్రస్తుతం వారిని యథాస్థానాల్లో నియమిస్తున్నది. హైదరాబాద్ ఇరిగేషన్ యూనిట్లో మూడు డివిజన్లు ఉన్నాయి., ఒక్కో డివిజన్ పరిధిలో రెండేసి సబ్ డివిజన్లు ఉన్నాయి. భవన నిర్మాణాలు, రియల్ఎస్టేట్ వెంచర్లకు సంబంధించి ఎన్వోసీల (నో అబ్జక్షన్ సర్టిఫికెట్) జారీలో అవినీతి ఆరోపణలు బయటకురావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా ఎన్వోసీలు జారీ చేయకుండా జాప్యం చేశారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీఈ యూనిట్ ప్రక్షాళన పేరిట 55 మంది ఇంజినీర్లను గత అక్టోబర్‌లో ఉన్నపళంగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే ఎస్ఈ మొదలు పలువురు ఈఈ, డీఈఈ, ఏఈఈ, ఏఈల వరకు అందరినీ ఇతర ప్రాంతాలకు ఓడీ (ఆఫీసర్ ఆన్ డ్యూటీ)పై బలవంతంగా సాగనంపింది.
అయితే, అవినీతి ఆరోపణలకు సూత్రధారులైన ఇంజినీర్లను వదిలిపెట్టి, సంబంధమేలేని, ఒక్క ఎన్వోసీ జారీ చేయని, ఎలాంటి వివాదాలు, అవినీతి ఆరోపణలు, ఇతరత్ర రిమార్క్స్లేని ఇంజినీర్లను సైతం ఓడీలపై పంపింది. సర్కార్ తీరును ఇంజినీర్లు తీవ్రంగా విమర్శించారు. ఇరిగేషన్ శాఖలో ఆ రగడ ఇప్పటికీ కొనసాగుతున్నది. ఈ విషయమై ‘ఇదేమి సర్కార్.. ఇవేమి బదిలీలు’ పేరిట ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో తాజాగా సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలుస్తున్నది. ఓడీపై బదిలీ చేసిన హైదరాబాద్ యూనిట్ డివిజన్-1 ఈఈ సురేశ్‌బాబును తిరిగి యథాస్థానంలో నియమించింది. ఓడీపై నియమించిన విద్యాసుమన్ను తిరిగి సూర్యాపేటకు పంపింది.
ప్రభుత్వం చేపట్టిన బదిలీలతో ఇప్పటికీ పలువురు ఇంజినీర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ సీఈ యూనిట్‌లోని చేవెళ్ల ఇరిగేషన్ సర్కిల్ వికారాబాద్ డివిజన్లో ఈఈగా పనిచేస్తున్న ఓ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఉన్నపళంగా సుదూరంలోని సూర్యాపేట సీఈ యూనిట్ డివిజన్-2 తిరుమలగిరికి పంపింది. సదరు ఇంజినీర్ భార్య కండరాల సంబంధిత వైకల్యంతో పూర్తిగా మంచానికే పరిమితయ్యారు. ఇద్దరు కుమారులు ఉన్నత విద్యాభాస్యం కోసం సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. భార్యతోపాటు వయోధికుడైన తండ్రి బాగోగుల బాధ్యతను కూడా సదరు ఇంజినీరే నిర్వర్తిస్తున్నారు.
ప్రభుత్వం ఉన్నపళంగా సుదూర ప్రాంతానికి బదిలీ చేయడంతో, గత నాలుగు నెలల నుంచి సదరు ఇంజినీర్ నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్నతాధికారులకు అనేకసార్లు తన గోడు చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. మరికొంత మంది మహిళా ఇంజినీర్లు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇకనైనా తక్షణం స్పందించి, బదిలీలపై విచారణ చేయించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జలసౌధ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. బదిలీ చేసిన ఇంజినీర్లను యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.