పటాన్చెరు/రామచంద్రాపురం, నవంబర్ 7: వికాసం కావాలా.. విధ్వంసం గెలవాలా మీర్చే తేల్చుకోవాలని మాజీమంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు కేసీఆర్ నగర్‌లోని డబుల్బెడ్రూం లబ్ధిదారులతో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొల్లూరులో ఇన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టి మీకంటూ ఒక ఇంటిని అందజేసిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. నిన్నటిదాక డబుల్బెడ్రూమ్ ఇండ్లలో నెలకొన్న సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్ మంత్రులు, సీఎంకు ఇప్పుడు మీపై ప్రేమ పుట్టడానికి కారణం జూబ్ల్లీహిల్స్ ఎన్నికలే కారణం అన్నారు.
ఎన్నికల తర్వాత వారు మిమ్మల్ని పట్టించుకోరని హరీశ్‌రావు చెప్పారు. కిరాయి ఇండ్లలో ఉన్న మీ బాధలను గమనించిన కేసీఆర్, మీకు కొల్లూరులో అన్ని హంగులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చారని గుర్తుచేశారు. రూ. 50 లక్షల విలువ చేసే ఇంటికి ఇప్పుడు మీరు యజమానులుగా మారడానికి కారణం బీఆర్ఎస్ అన్నారు. మీకు నీడను కల్పించిన కేసీఆర్‌ను మరవకండని హరీశ్‌రావు కోరారు. కొల్లూరు లబ్ధ్దిదారులు నీతి తప్పొద్దు..సద్ది తిన్న రేవు మరువొద్దన్నారు. కొల్లూరు డబుల్బెడ్రూమ్ ఇండ్లలో ఉన్నవారికి నరకయాతన చూపించిన ఘనత కాంగ్రెస్‌దే అని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల్లో మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ మంత్రులు మీ వద్దకు వచ్చి అబద్ధ్దపు హామీలిస్తున్నారని, వారికి జూబ్లిహిల్స్ ఎన్నికల్లో ఒక్క ఓటు వేయొద్దని హరీశ్‌రావు కోరారు. గట్టిగా బుద్ది చెబితేనే కొల్లూరులో మీకు వసతులు కల్పిస్తారన్నారు.

కుల, మతాలు, ప్రాంతాలు చూడకుండా డబుల్బెడ్రూం ఇండ్లు బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు. రేవంత్‌రెడ్డికి కూల్చడం తప్పా ఒక్క ఇంటినైన జంటనగరాల్లో నిర్మించాడా అన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఇంటినైన కడితే చూపించాలని సవాల్ చేశారు. కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పొందిన ప్రతి ఒక్కరి గుండెల్లో బీఆర్ఎస్ ఉందన్నారు. మీకు డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించేందుకు కృషి చేసిన దివంగత మాగంటి గోపీనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపే సమయం ఆసన్నమైందన్నారు. భర్తను తలుచుకొని గోపీనాథ్ సతీమణి ఏడిస్తే దానిపై చవకబారు విమర్శలు చేయడం కాంగ్రెస్ నాయకులకు సబబా అని ప్రజలను హరీశ్‌రావు అడిగారు. కాంగ్రెస్ వాళ్లు చనిపోతే వారి భార్యలు ఏడుస్తారా.? లేదా అని అడిగారు. మాగంటి సునీత కారు గుర్తుకు ఓటేసీ గెలిపించాలని హరీశ్‌రావు కోరారు.
మీకు అధికారంలో వచ్చాకా ఇస్తామన్న తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందా.? అని హరీశ్‌రావు ప్రజలను అడిగారు. తులం బంగారం ఇవ్వడం చేతకాకపోతే హామీ ఎందుకు ఇచ్చారని నిలదీశారు. పోనీ మహిళలకు మహాలక్ష్మీ పథకంలో రూ. 2500 ఇస్తామని హామీనిచ్చారని, మీకు ఆ డబ్బులు రేవంత్‌రెడ్డి ఇచ్చాడా..? అని ప్రశ్నించారు. కొల్లూరు డబుల్బెడ్రూం ఇండ్ల వాసుల మురుగు సమస్య, పారిశుధ్య సమస్య, రేషన్ దుకాణాల సమస్య, పిల్లలకు స్కూళ్ల సమస్య తీరిందా..? అన్నారు. బతుకమ్మ చీరలు అందాయా? అసలు బీఆర్ఎస్ హయాంలో ఉన్న సంక్షేమం ఇప్పుడుందా అని అడిగారు. ముస్లింలు సహాయం పొందితే జీవితాంతం మరువరన్నారు.
కేసీఆర్ హిందు, ముస్లిం, క్రిస్టియన్ అనే బేధం లేకుండా డబుల్ బెడ్రూం ఇండ్లు అందించారని హరీశ్‌రావు గుర్తుచేశారు,. సీఎం రేవంత్‌రెడ్డి ధరలు పెంచి ప్రజల జీవితాలను అప్పులమయం చేశాడని విమర్శించారు. జహీరాబాద్ మైనార్టీ విద్యార్థులు ఎంబీబీఎస్ ర్యాంకులు సాధించి డాక్టర్లు అవబోతున్నారన్నారు. విద్య, వైద్యం, సంక్షేమానికి బీఆర్ఎస్ పెద్ద పీట వేసిందన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేసిన ఘనత తమదేన్నారు. పట్టణాల్లో బస్తీ దవాఖానాలు పెట్టి వైద్య సేవలందించామని తెలిపారు. ఇప్పుడు మీకు ఎలాంటి సేవలు లభిస్తున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. ఈనెల 11న జరిగే జూబ్లిహీల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. మీతో పాటు జూబ్లిహిల్స్‌లో ఉన్న బంధువులు, స్నేహితులతో కారు గుర్తుకు ఓటు వేయించాలని హరీశ్‌రావు కోరారు.

ఈ ఎన్నికల్లో మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్‌కు ఓటర్లు చుక్కలు చూపిస్తున్నారన్నారు. మీరు కూడా కొల్లూరు నుంచి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్‌కు పడకుండా చూడాలని హరీశ్‌రావు అనగా, దీనిపై ప్రజలనుంచి భారీ స్పందన వచ్చింది. కాంగ్రెస్ మంత్రి ఉత్తమ్ కొల్లూరు డబుల్‌బెడ్‌రూ ఇండ్ల వద్ద మీటింగ్ పెడితే కుర్చీలు ఖాళీగా ఉన్నాయని, అదే బీఆర్ఎస్ మీటింగ్‌కు ఈ రోజు మూడు సార్లు అదనంగా కుర్చీలు తెప్పించాల్సి వచ్చిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అంటే మీ అందరికీ అభిమానం అన్నారు. ఈ నెల 11న జూబ్లిహిల్స్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని హరీశ్‌రావు కోరారు.
కేసీఆర్ సర్కార్ పేదల కోసం లక్షల ఇండ్లు నిర్మాణం చేసి, పేదల అత్మగౌరవం పెంచిందని, సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో లక్షల ఇండ్లు కూల్చివేశారని రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించి, పురుషుల టికెట్ ధర పెంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. అబద్ధ్దాలు చెప్పి రేవంత్ అధికారంలోకి వచ్చారని, కేసీఆర్ పేదలకు ఇండ్లు పట్టాలు పంపిణీ చేసి వారి ఆత్మగౌరవం పెంచారన్నారు. కేసీఆర్ 58 జీవోతో ఎంతోమంది పేదలకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారని గుర్తుచేశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి పేదలకు సొంతింటి కలను సాకారం చేసింది కేసీఆర్ సర్కార్ అన్నారు. హామీ ఇవ్వకున్నా షాదీముబారక్, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్, న్యూట్రీషన్ కిట్ వంటి పథకాలు కేసీఆర్ అమలు చేశారని హరీశ్‌రావు గుర్తుచేశారు.