Elderly couple marriage : నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబాల ఆనవాళ్లు దాదాపుగా కనుమరుగైపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఛత్తీస్‌గఢ్ (Chhattishgarh) లోని అంబికాపుర్ (Ambikapur) కు చెందిన బల్దేవ్ ప్రసాద్ (Baldev Prasad) తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచి ఇప్పటి తరాలకు ఆదర్శంగా నిలిచారు. బల్దేవ్ వారసులు ఆయన 65వ వివాహ వార్సికోత్సవాన్ని (Wedding Anniversary) ఘనంగా నిర్వహించి ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పారు.
బలదేవ్ ప్రసాద్ సోని, బేచనీ దేవిల వివాహం జరిగి 65 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన 18 మంది మునిమనువలు తమ ముత్తాత 65వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఒక్కటై స్వగ్రామానికి చేరుకున్నారు. హల్దీ, సంగీత్‌తో మొదలుపెట్టి పెళ్లి వేడుక వరకు అన్ని వైభవంగా నిర్వహించారు. ఈ పెళ్లి వేడుకలో చేతికర్ర పట్టుకున్న వరుడు.. సిగ్గుతో ముడుచుకుపోయిన వధువు మెడలో పూలమాల వేసి దగ్గరకు తీసుకున్నాడు.
పెళ్లి అనంతరం బల్దేవ్ కుటుంబసభ్యులు, బంధువులు బరాత్‌లో నృత్యాలు చేసి అదరగొట్టారు. అంతకుముందు బల్దేవ్ ముని మనవడు తనిష్క్ కారు నడుపుతూ వధూవరులను వివాహ మండపానికి తీసుకొచ్చారు. పెళ్లిలో వధూవరుల జంట కొత్త పెళ్లిలో మాదిరిగానే ప్రమాణాలు చేసింది. ఈ సందర్భంగా బల్దేవ్ మాట్లాడుతూ.. అప్పట్లో మా పెళ్లి చాలా సాదాసీదాగా జరిగిందని, ఇప్పుడు మా మునిమనువలు వైభవంగా వేడుక జరిపి ఆ ముచ్చట తీర్చారని అన్నారు.
కుటుంబ విలువలు, అనుబంధాల మాధుర్యాన్ని కొత్త తరాలకు చాటేందుకే ఈ వేడుక జరిపినట్లు బలదేవ్ మనవడు సిద్ధార్థ్ చెప్పారు.