తిరుమల : త్వరలో ప్రారంభం కానున్న వేసవి ( Summer ) సెలవుల సందర్భంగా తిరుమల ( Tirumala ) రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ (TTD ) అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు.
తిరుమలలోని పద్మావతి అతిథి గృహం సుధర్మ సమావేశ మందిరంలో అధికారులతో వేసవి ఏర్పాట్లపై శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గత రెండు,మూడు సంవత్సరాల వేసవి డేటాను విశ్లేషించి, దర్శనాల సంఖ్య, వేచి ఉండే సమయం, తర్వాత రోజు దర్శనాలకు క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల సంఖ్య వంటి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు వివరించారు.
భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అన్నప్రసాదం, తాగునీటి పంపిణీ, నడక దారి భక్తులకు మార్గమధ్యలో షెడ్ల ఏర్పాటు, మాడ వీధులు తదితర ప్రాంతాల్లో కూల్ పెయింటింగ్, అవసరమైన చోట్ల షెడ్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సామాన్య భక్తులు దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించి వీలైనంత త్వరగా దర్శనం కలిగేలా చర్యలు చేపట్టడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు అదనపు ఈవో తెలిపారు.
ఈసారి ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా టెక్నాలజీ వినియోగాన్ని మరింత పెంచి, గంటల వారీగా ఇన్,అవుట్ ఫ్లో, వేచి ఉండే సమయాన్ని ప్రతి నిమిషం పర్యవేక్షిస్తూ అవసరమైన చోట తక్షణ నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. గత వేసవిలో జూన్ నెలలో సగటున రోజుకు 80 వేల నుంచి 82 వేల మందికి దర్శనం కల్పించామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ సీఈ సత్య నారాయణ, ట్రాన్స్ పోర్ట్ జీఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, భాస్కర్, సోమన్నారాయణ, వెంకటయ్య, వేంకటేశ్వర్లు, వీజీవో సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు.