కొండపాక(కుకునూర్‌పల్లి), నవంబర్ 7: హృదయ సంబంధిత చిన్నారులకు సత్యసాయి సంజీవని దవాఖానలో అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని సత్యసాయి సంజీవని దవాఖానలో విజయవంతంగా గుండె ఆపరేషన్లు పూర్తయిన చిన్నారులకు శుక్రవారం గిఫ్ట్ ఆఫ్ లైఫ్ సర్టిఫికెట్లను సత్యసాయి సంజీవని దవాఖానల చైర్మన్ శ్రీనివాస్‌తో కలిసి సీపీ అందజేశారు.
ఈ సందర్భంగాకా పోలీస్ కమిషనర్ విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. సమాజంలో స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో సంజీవని దవాఖానలో చిన్నారులకు అందిస్తున్న నిస్వార్థ వైద్యసేవలు ప్రశంసనీయం అన్నారు. విజయవంతంగా గుండె ఆపరేషన్లు పూర్తిచేసి ఎంతోమంది చిన్నారులకు ఆయుష్షును పోశారన్నారు. భవిష్యత్తులో ఈ సేవలు ప్రపంచమంతా విస్తరించాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు సంజీవని దవాఖానలో 222మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినట్లు చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో సత్యసాయి సంజీవని దవాఖాన ఇన్చార్జి జగన్నాథ శర్మ, రోటరీ క్లబ్ ఆఫ్ మొయినాబాద్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.