హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రెగ్యులర్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు ప్రభుత్వం 75% హాజరు నిబంధన తీసుకొచ్చింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే ఈ అసంబద్ధ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నిబంధనతో పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదమున్నదని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెంటనే ఈ నిర్ణయంపై పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సాధారణ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు 75% హాజరు అవసరంలేదని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దిగిరాకుంటే విద్యార్థి సంఘాలతో పోరాటా నికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.