గజ్వేల్, నవంబర్ 7: ఈసారి భారీగా వర్షాలు కురవడంతో పత్తి పంటపై తీవ్ర ప్రభావం పడింది. చేనుపైనే పత్తి తడవడంతో రైతులు పత్తి తీసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఎడతెరపిలేని వర్షాలకు పత్తి రంగు మారింది. తడిసిన పత్తిని ఏరిన రైతులు, దానిని ఆరబెట్టడానికి అవకాశం లేకుండా పోయింది. పత్తి తడవడంతో తేమశాతం అధికం ఉండి అమ్ముకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. సిద్దిపేట జిల్లాలో 23 పత్తి జిన్నింగ్ మిల్లులు ఉండగా, అందులో 22 జిన్నింగ్ మిల్లులను మార్కెటింగ్ అధికారులు పత్తి కొనుగోలుకు నోటిఫై చేశారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ)ద్వారా జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు. సిద్దిపేట జిల్లాలో 1,07,459 ఎకరాల్లో రైతులు పత్తిని సాగు చేశారు. ఈసారి అధిక వర్షాలకు దిగుబడి సగానికి పైగా తగ్గింది. ఇప్పటి వరకు రైతులు రెండు దఫాలుగా పత్తిని చేను నుంచి ఏరారు.
ఎకరానికి సుమారుగా 12క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తాదని వ్యవసాయాధికారుల అంచనా తప్పింది. ఎకరాకు సుమారుగా 3నుంచి 4క్వింటాళ్ల వరకే దిగుబడి వస్తున్నదని రైతులు చెబుతున్నారు. జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో 663మంది రైతుల నుంచి 7576 క్వింటాళ్ల పత్తిని ఇప్పటి వరకు కొన్నారు. వ్యాపారులు 34,254క్వింటాళ్ల పత్తిని కొన్నారు. పత్తిలో 8నుంచి 12తేమశాతం ఉంటేనే సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 చెల్లిస్తున్నారు. తడిసిన పత్తిని ప్రస్తుతం ఆరబెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో మద్దతు ధర దక్కక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతులు స్లాట్ బుక్ చేసుకొని సీసీఐ కేంద్రాలకు పత్తిని తీసుకెళ్తే, తేమశాతం ఎక్కువగా ఉందంటూ కొనుగోలుకు నిరాకరిస్తున్నారు.
వారం వరకు కురిసిన వర్షాలకు చేనుపై పత్తి రంగు మారుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.తడిసిన పత్తి 20నుంచి 25వరకు తేమశాతం వస్తుండడంతో సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా తడిగా ఉన్న పత్తిని ఇంట్లోనే నిల్వ ఉంచడంతో రంగుమారుతున్నది. ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో నిబంధనల పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నరు. ఎకరాకు 7క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామనే నిబంధనలతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో మాదిరిగానే ఈసారి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.
రైతులు పత్తిని ఆరబెట్టుకొని 12శాతంలోపు తేమశాతం ఉండేలా చూసుకోవాలి. 12శాతంలోపు తేమశాతం ఉంటే క్వింటాలుకు మద్దతు ధర రూ.8110 చెల్లిస్తారు. రైతులు పత్తిని అమ్ముకునే సమయంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సహకరించాలి.
– నాగరాజు, జిల్లా మార్కెటింగ్ అధికారి సిద్దిపేట