హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ (BRS) గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎంతచేసినా గెలువలేం’ అనే భావనకు వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భారీ స్కెచ్ వేసినట్టు పరిణామాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల (Jubilee Hills By-Election) ఫలితాల అనంతరం సీఎం సీటుకు ఎసరొచ్చే ప్రమాదం ఉన్నదనే ప్రచారం స్వయంగా కాంగ్రెస్ సర్కిల్లోనే సాగుతున్నది. దీంతో ఈ పద్మవ్యూహం నుంచి తక్షణం బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీ నేతల కన్నా ఆదుకునే స్నేహితుడే మిన్న అన్నట్టు కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సహాయాన్ని రేవంత్‌రెడ్డి నమ్ముకున్నారని, రేవంత్‌రెడ్డి అడిగిందే తడవుగా ఆపదలో ఉన్న మిత్రుడిని ఆదుకునేందుకు బండి సంజయ్ ఏకంగా రంగంలోకి దిగారనే చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎంతచేసినా ముస్లింలు తమను విశ్వసించడం లేదని కాంగ్రెస్ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తే ముస్లింలు మద్దతిస్తారని సీఎం రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ ముఖ్యనేతలు భావించారు. అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారనే ఆసక్తికరమైన చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతున్నది.
జూబ్లీహిల్స్ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ధాటిని తట్టుకొని నిలబడటం కాంగ్రెస్ శ్రేణులతో కావడంలేదనే చర్చ బలంగా ఉన్నది. మంత్రులు, కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పో యిందని తేలింది. ఈ నేపథ్యంలోనే బీజేపీ స హాయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి కోరారని, అం దులో భాగంగా బండి సంజయ్ రంగంలో ది గారనే ప్రచారం సాగుతున్నది. ‘అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినా.. ఎంఐఎం వాళ్లను ప్రచారంలో తిప్పుతున్నా పెద్దగా ఫాయిదా అయ్యేట్టు కనిపించడం లేదు. ముస్లింలు కన్సాలిడేటెడ్‌గా బీఆర్ఎస్కు షిప్ట్ అయ్యారు. ఆ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్లాన్ చేస్తున్నాం’ అని నాలుగైదు రోజుల క్రితం కాంగ్రెస్ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారని సమాచారం.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో ఉన్నా.. ప్రచార హోరులో మాత్రం బీజేపీ పత్తాలేకుండా పోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాం గ్రెస్‌గా మారిన వాతావరణాన్ని ‘హిందూ వర్సెస్ ముస్లిం’గా మార్చాలన్న కుట్రలో భాగంగానే బండి సంజయ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి రంగంలోకి దింపారని, ఆ మేరకు వచ్చీరావడంతో ‘బోరబండ’ నాటకీయ పరిణామం అని ప్రజలు బాహాటంగానే చ ర్చించుకుంటున్నారు. కేంద్ర హోంశాఖ స హాయ మంత్రి బండి సంజయ్ ప్రచారానికి పోలీసులు అనుమతి నిరాకరించే అవకాశమే ఉండదు. అలాంటిది ప్రచారానికి అనుమతి నిరాకరిస్తున్నామని కావాలని చెప్పడం ద్వారా ప్రచారంలో ఉత్కంఠను రేకెత్తించి, ఉద్రిక్త వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి తద్వారా ఫలితాన్ని పొందాలనే కుట్ర దాగి ఉన్నది. ఆ దూరదృష్టితో ముందు సంజయ్ ‘జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ విజయసంకల్ప రోడ్‌షో’కు అనుమతి ఇచ్చి నిరాకరించారు. దీని వెనుక భారీ వ్యూహం దాగి ఉన్నదని, బీఆర్ఎస్ వైపు మళ్లిన ప్రజలను తిరిగి కాంగ్రెస్ వైపు రప్పించే కుట్ర దాగి ఉన్నదని, అందులో భాగమే బండి సంజయ్ ‘చీల్చివేత’ ప్రసంగం అని చెప్పుకుంటున్నారు.