సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 7: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డీఈవోను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలించగా, అవి అపరిశుభ్రంగా కనిపించడంతో పాటు ఎఫ్ఆర్ఎస్ సిస్టం సక్రమంగా అమలు చేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పాఠశాల హెచ్ఎంను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
పాఠశాలలో పారిశుధ్య సిబ్బందిని తొలిగించి కొత్తవారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల ఆవరణలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలన్నారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థుల విషయ పరిజ్ఞానంపై ఆరా తీశారు. పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు టీచర్లు ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లాలని కలెక్టర్ ప్రావీణ్య సూచించారు. పాఠశాలలో ఎఫ్ఆర్ఎస్ సిస్టం పూర్తి స్థాయిలో అమలు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈవో వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.