ఛత్రీ పట్టి పరిశ్రమలు తెస్తే.. తుపాకీ పెట్టి బెదిరిస్తున్నరు
కేసీఆర్ పాలనలో టీఎస్ఐపాస్ తెచ్చి అనుమతులను సులభతరం చేసినం. రాష్ర్టాన్ని పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చినం. పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ వేసినం. టెక్ మహీంద్ర సీఈవోకు నాడు కేటీఆర్ వర్షంలో గొడుగుపట్టి ఆహ్వానించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నరు.
హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారుది క్యాబినెట్లా లేదని.. దండుపాళ్యం ముఠాలా ఉన్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) దెప్పిపొడిచారు. క్యాబినెట్ మీటింగ్ పేరిట కాంగ్రెస్ మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, కబ్జాలు, పోస్టింగుల్లో వాటాల పంచాయితీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవాచేశారు. నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్, నదుల్లో నీటివాటా, నిధుల వాటా కోసం కేంద్రంతో కొట్లాడితే.. నేటి ముఖ్యమంత్రి, మంత్రులు కమీషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లలో వాటాల కోసం కొట్లాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. పారిశ్రామికవేత్తలను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, సినిమా హీరోలను, కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి సన్నిహితులే పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ పెట్టి బెదిరించారని మంత్రి కుమార్తె స్వయంగా చెప్తుంటే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనలపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్ స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో లేదా ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించి నిజానిజాలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు జరుపుతామనడం హాస్యాస్పదంగా ఉన్నదని మండిపడ్డారు.‘పెట్టుబడిదారులు, వ్యాపారులు, సినిమా పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు.. మిమ్మల్ని, రాష్ట్రాన్ని కాపాడుకుంటం’ అని భరోసా ఇచ్చారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పలె రవికుమార్గౌడ్తో కలిసి హరీశ్ మీడియాతో మాట్లాడారు.
క్యాబినెట్ మీటింగ్ జరిగితే ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తదని మహిళలంతా ఆశగా ఎదురుచూశారని, దీపావళి పూటామహిళలకు నిరాశే మిగిల్చారని హరీశ్ దుయ్యబట్టారు. ‘క్యాబినెట్ మీటింగ్‌లో ప్రజాసమస్యలపై మాట్లాడుతారనుకున్నం.. దసరాకు మొండిచెయ్యి చూపిండ్రు.. దీపావళి కానుకగానైనా ప్రజలకేదైనా తీపి వార్త చెప్తురేమో అనుకున్నం. కానీ, అందరికీ నిరాశే మిగిలింది. క్యాబినెట్ మీటింగ్ పేరుతో మంత్రుల పంచాయితీ పెట్టుకున్నరు. మంత్రులు ఒకటి కాదు, రెండు కాదు అరడజను వర్గాలుగా చీలిపోయిండ్రు. ఒకరంటే ఒకరికి పడుతలేదు. సీఎం, మంత్రులు పాలనను గాలికి వదిలి పర్సనల్ పంచాయితీలు పెట్టుకుంటున్నరు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలు, కబ్జాలు, పోస్టింగుల కోసం కొట్లాడుకుంటున్నరు. ఇది క్యాబినెట్ లెకలేదు.. దండుపాళ్యం ముఠాలెక ఉన్నది. అతుకుల బొంతలా ఉన్న ప్రభుత్వంలో ఎప్పుడేం జరుగుతదోనని మంత్రులే భయపడుతున్నరు. దీపం ఉండంగనే ఇల్లు చకబెట్టుకోవాలని అందినకాడికి దండుకోవాలని చూస్తున్నరు’ అని తూర్పారబట్టారు.
బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల్లో 95 శాతం లోకల్ రిజర్వేషన్, నీళ్లు, నిధుల వాటా కోసం కేంద్రంతో కేసీఆర్ కొట్లాడిండ్రు. నేడు కమీషన్లు, కాంట్రాక్టులు, అక్రమ వసూళ్లలో వాటాల కోసం మంత్రులు కొట్లాడుతున్నరు. కాంట్రాక్టుల కోసం డిపార్ట్మెంట్లనే రద్దు చేస్తున్నరు.
బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్‌గా ఉంటే నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గన్ కల్చర్ రాజ్యమేలుతున్నదని హరీశ్ విమర్శించారు. ‘తెలంగాణలో ఇప్పుడు వ్యాపారవేత్తలకు తుపాకులు పెడుతున్నరు. రేవంత్‌రెడ్డి గన్‌కల్చర్ తెచ్చిండు. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నరు. అందుకే రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు తగ్గిపోయినయ్. ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు. ముఖ్యమంత్రి సన్నిహితులే తుపాకీ పెట్టి బెదిరించిండ్రు.. ముఖ్యమంత్రి జపాన్ నుంచి ఫైల్ ఆపించిండ్రు.. ఇంకో మంత్రి టెండర్లు మాకు దకవద్దని హుకుం జారీచేసిండ్రని ఒక మంత్రి కుమార్తెనే స్పష్టంగా చెప్తున్నరు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉన్నది? ముఖ్యమంత్రే తుపాకీ పంపారంటే ఎందుకు విచారణ జరపరు? రాష్ట్రంలో ఉన్నది బీజేపీ, కాంగ్రెస్ జాయింట్ వెంచర్ సర్కారు కాకుంటే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలి. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో విచారణ జరిపించాలి. లేదా ఇండిపెండెంట్ జ్యుడీషియల్ కమిషన్ పెట్టి నిజానిజాలు బయటకు తీయాలి. లేదంటే మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే’ అని నిలదీశారు.
రాష్ట్రంలో 23 నెలల పాలనలో ఏం సాధించారని విజయోత్సవాలు? చేస్తారని హరీశ్ ప్రశ్నించారు. ‘డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు చేస్తరట! దేని కోసం? ఒక ఇల్లు కట్టింది లేదు.. ఒక ఇటుక పేర్చింది లేదు.. ఒక చెక్ డ్యాం కట్టింది లేదు.. ఒక ఎకరాకు నీళ్లిచ్చింది లేదు. టిమ్స్ దవాఖానలు పూర్తి చేసింది లేదు. ఉన్న పథకాలను ఊడగొట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వనందుకు విజయోత్సవాలు చేసుకుంటరా? కేసీఆర్ కిట్ బంద్ చేశామని జరుపుతరా? గొర్రెల సీం బంద్ పెట్టినమని జరుపుతరా? కట్టిన ఇల్లు.. పెట్టిన పొయ్యి లా ఉన్న అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఆగం చేసిండ్రు. ఆరు గ్యారెంటీలకు దికు లేదు. 420 హామీల అమలు ఊసు లేదు. అయినా విజయోత్సవాలు చేస్తమని చెప్పుకోడానికి సిగ్గులేదు’ అని నిప్పులు చెరిగారు.
డిసెంబర్ 1 నుంచి 9 వరకు విజయోత్సవాలు చేస్తరట! ఎందుకు? 23 నెలల పాలనలో ఏం చేసిండ్రు? ఏం సాధించిండ్రని విజయోత్సవాలు జరుపుతరు? ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసినందుకా? తుపాకులు పెట్టి వసూళ్లు చేస్తున్నందుకా? మంత్రులు.. మంత్రులు కొట్టుకుంటున్నందుకా? దేనికోసం విజయోత్సవాలు?
‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను అరిగోస పెడుతున్నందుకు విజయోత్సవాలు జరుపుకొంటరా?’ అని హరీశ్ మండిపడ్డారు. ‘రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టినందుకా? కౌలు రైతులకు భరోసా ఇవ్వనందుకా? రైతు కూలీలందరికీ ఆత్మీయ భరోసా ఇవ్వకుండా మోసం చేసినందుకా? రుణమాఫీ చారాణా చేసి బారాణా మందిని మోసం చేసినందుకా? అన్ని పంటలకు బోనస్ అని సన్నాలకే పరిమితం చేసినందుకా? రూ.1,300 కోట్ల బోనస్ డబ్బులు రైతులకు చెల్లించనందుకా? దేశానికి అన్నం పెట్టే రైతన్నలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేసినందుకా? లగచర్ల, రాజోలి రైతుల చేతులకు బేడీలు వేసినందుకా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని యువతను మోసం చేసినందుకా? నిరుద్యోగ భృతి ఎగ్గొడుతున్నందుకా? మహాలక్ష్మి పేరిట నెలకు రూ.2500 ఇస్తానని, ఇప్పటికీ అమలు చేయనందుకా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకా? అవ్వ,తాతలకు పింఛన్లు పెంచనందుకా? హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చినందుకా? మూసీ సుందరీకరణ పేరుతో కమీషన్లు దండుకుంటున్నందుకా? ఎందుకు విజయోత్సవాలు చేస్తానంటున్నవు రేవంత్‌రెడ్డి?’ అని నిలదీశారు.
కమీషన్లు దండుకోవడమే లక్ష్యంగా రోడ్ల నిర్మాణానికి కొత్తగా హ్యామ్ మోడల్‌ను తెస్తున్నారని హరీశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.10,547 కోట్లతో టెండర్లు పిలిచి, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమీషన్లు దండుకునే ప్రయత్నమిదని మండిపడ్డారు. ‘మా పాలనలో రోడ్లు వేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్డు వేసింది. ప్రతి మండల కేంద్రానికి, జిల్లా హెడ్ క్వార్టర్లకు రోడ్లు వేసింది. ఇప్పుడు హ్యామ్ పేరిట రాష్ర్టాన్ని అప్పుల కుప్పగా చేస్తున్నరు. బ్యాంకుల్లో అప్పు పుట్టకపోతే జీవో 53, 54తో కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై భారం వేసిండ్రు. పేద, మధ్య తరగతి ప్రజలపై రేవంత్‌రెడ్డి దొంగ దెబ్బ కొట్టిండు. లైఫ్ టైం టాక్సులు, రిజిస్ట్రేషన్ చార్జీలు అడ్డగోలుగా పెంచి ప్రజల రక్తం పీల్చుతున్నరు. ఇప్పటికే రేవంత్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పయ్యింది. సివిల్ సప్లయ్‌లో అప్పులు పేరుకుపోయాయి. ట్రాన్స్‌కో డిసంలను అప్పుల కుప్పలుగా మార్చిండ్రు. ఎఫ్ఆర్బీఎం అప్పులు పదేండ్లలో ఎన్నడూ తేనంత తెచ్చిండ్రు. హ్యామ్ మోడల్ కోసం రుణాలు సేకరించేందుకు టాక్స్‌లు పెంచిండ్రు. టోల్ ద్వారా వసూలు చేయబోమని చెప్తూ దొంగదారిలో ఈ పన్నులు పెంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హ్యామ్ మోడల్‌పై విచారణ జరిపిస్తం, దోచుకున్న ప్రతి ఒకరిపై రికవరీ పెడుతం’ అని హెచ్చరించారు.
నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నరు. ప్రజాసమస్యల గురించి మాట్లాడుతరేమో అనుకున్నం. రైతులకు బోనస్ బకాయిలు 1300 కోట్లు ఇస్తరేమో అనుకున్నం.. మహిళలకు 2500 ఇచ్చే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తరేమో అనుకున్నం. పింఛన్లయినా పెంచుతరేమో అనుకున్నం. ఏదీ లేదు.. క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి, మంత్రుల పంచాయితీ పెట్టుకున్నరు.
-హరీశ్‌రావు
దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ర్టాన్ని రెండేండ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని హరీశ్ మండిపడ్డారు. ప్రజాసమస్యలను గాలికి వదిలి మంత్రులే దంచుకుంటున్నా, మంత్రులు గొడవలు పెట్టుకుంటున్నా సీఎం చోద్యం చూస్తున్నారని విమర్శించారు. పాలన గాడి తప్పిందని, అరాచకత్వం పెరిగిందని ఫైరయ్యారు. ముఖ్యమంత్రే తుపాకీ ఇచ్చారని క్యాబినెట్ మంత్రి కుటుంబసభ్యులు చెప్తున్నందున ఈ ఘటనపై కేంద్రం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంలో తాము కూడా లీగల్ ముందుకెళ్తామని, ఏ ఏజెన్సీలు, సంస్థలకు ఫిర్యాదు చేయాలన్న దానిపై బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ‘పెట్టుబడిదారులు, సినిమా పెద్దలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విజ్ఞప్తి చేస్తున్నం. ప్రభుత్వ అరాచకాలకు భయపడవద్దు. తెలంగాణభవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటయి’ అని విజ్ఞప్తిచేశారు.
టీఎస్ఐపాస్ అమలులోకి వచ్చిన తర్వాత రేవంత్ హయాంలోనే అతి తక్కువ పెట్టుబడులు వచ్చాయని హరీశ్ వివరించారు. 2024-25లో 2,049 పరిశ్రమలు, రూ.13, 730 కోట్ల పెట్టుబడులే వచ్చాయని, ఇది ఎవర్ లోయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇచ్చామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో తుపాకీతో పెట్టుబడిదారులను బెదిరించే దుస్థితి దాపురించిందని వాపోయారు.
సోషల్ మీడియాలో పోస్టును రీట్వీట్ చేస్తేనే రాత్రికి రాత్రి అరెస్ట్ చేస్తున్నరు కద! మరి ఇక్కడ ఇంత ఓపెన్‌గా టెండర్లు వేయొద్దని బెదిరిస్తుంటే.. తుపాకులు పట్టుకొని తిరుగుతుంటే ఇవి కనబడుతలేవా డీజీపీకి? డీజీపీ మొన్న మాట్లాడిండు కదా? పింక్ బుక్కు లేదు.. రెడ్డు బుక్కు లేదు.. అంతా ఖాకీ బుక్కే ఉందన్నడు గదా? మరి ఆ ఖాకీ బుక్కులో ఇవి లేవా?