దిలావర్పూర్, సెప్టెంబర్ 7 : నిర్మల్ జిల్లావ్యాప్తంగా 735 పాఠశాలలు ఉండగా.. 41,752 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిర్వహణ నిధులు విడుదల కావాల్సి ఉంది. చాక్ పీస్‌లు, డస్టర్లు, ప్రయోగశాలలు, తాగునీరు, చిన్న చిన్న మరమ్మతులకు కూడా నిధులు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యేడాదికి రెండు పర్యాయాలు నిధులు విడుదల అయ్యేవి. కానీ.. పాఠశాలలు ప్రారంభైన నాలుగు నెలలు అవుతున్నా కాంగ్రెస్ సర్కారు నయాపైసా కూడా విడుదల చేయలేదు. దీంతో పనులు పెండింగ్ పడుతున్నాయి. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులే సొంతంగా డబ్బులు పెట్టుకుని పనులు చేయిస్తున్నారు.
పాఠశాలల్లో కానరాని క్రీడలు
క్రీడా పరికరాల కోనుగోలు, శిక్షణ కొరకు ప్రాథమిక పాఠశాలలకు రూ.5 వేలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.10 వేలు, ఉన్నత, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలకు రూ.25 వేలను ప్రతి ప్రభుత్వం మంజూరు చేసేది. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిధులను విడుదల చేయడం లేదు. దీంతో పాఠశాలల్లో క్రీడల సందడి కరువైంది.
సొంతంగా రూ.50 వేలు ఖర్చు చేసిన ఉపాధ్యాయులు
న్యూలోలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులు రూ.50 వేలకు పైబడి ఖర్చుచేసి వివిధ పనులు చేయించారు. ఈ పాఠశాలలో ఏడు తరగతులు ఉండగా.. వారికి సరిపడా గదులు లేక పోవడంతో నూతన భవనం నిర్మించారు. పనులు పూర్తి కాక పెండింగ్‌లో ఉండడంతో ప్రధానోపాధ్యాయురాలు, ఉపాద్యాయులు కలిసి రెండు గదులకు డోర్లు, కిటికీలు, జాలీలు, బ్లాక్‌బోర్డులు, విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఈ గదుల్లో 6,7 తరగతులను కొనసాగిస్తున్నారు.
నిధులు మంజూరు చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల నిర్వహణకు సంబంధించిన నిధులను త్వరితగతిన మంజూరు చేయాలి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి నిధులు ఇప్పటికీ మంజూరు కాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృషి ్టసారించి నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది.
– చంద్రశేఖర్, టీటీయూ జిల్లా అధ్యక్షుడు.