కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో గణేశ్ నిమజ్జన ( Ganesh immersion ) ఉత్సవాలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన వినాయక నిమజ్జన శోభాయాత్ర ఆదివారం ఉదయం 11 గంటలకు ముగిసింది. శ్రీ విఠలేశ్వర ఆలయం, యాదవ, మున్నూరు కాపు సంఘాలతో పాటు బృందావన్ కాలనీకి చెందిన వినాయక విగ్రహాలను సాంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజల అనంతరం భజనలు, కోలాటలు, మహిళల మంగళారతులతో వినాయకులను గంగమ్మ ఒడికి తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.
యువజన సంఘాలు, యువక మండళ్లు, ఆయా కాలనీలకు చెందిన వినాయక విగ్రహాల శోభాయాత్ర శనివారం రాత్రంతా కొనసాగి ఆదివారం ఉదయం ఘనంగా మూసింది. ఎడ్లబండి పై వినాయకుని తరలించడంతో శోభాయాత్ర మండల ప్రజలను ఆకర్షించింది. కుభీర్, పల్సి లోని శ్రీ విఠలేశ్వర, కాశీవిశ్వనాథ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ముందుగా నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించారు. నిమజ్జనం ప్రశాంతంగా జరగటానికి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.