Siddaramaiah : వచ్చే ఉగాది పండుగ తర్వాత కర్ణాటక (Karnataka) లో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందని జరుగుతున్న ప్రచారంపై ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) ఆశీర్వాదం ఉన్నంతవరకు తాను సీఎంగా కొనసాగుతానని చెప్పారు. ముఖ్యమంత్రి పీఠాన్ని వదలాలని పార్టీ అధిష్ఠానం సూచిస్తే.. అప్పుడు వదిలేస్తానని, అందులో తనకేమీ అభ్యంతరం లేదని అన్నారు.
వరుణ నియోజకవర్గం పిళ్లాహళ్లి హెలిప్యాడ్ వద్ద శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కర్ణాటకలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టానన్న సంతృప్తి తనలో ఉందని చెప్పారు. పార్టీ అధి నాయకత్వం అవకాశం కల్పిస్తే మరో రెండుసార్లు బడ్జెట్ ప్రవేశపెడతానని అన్నారు. వారి నిర్ణయానికి తాను అన్ని సమయాల్లోనూ కట్టుబడి ఉన్నానని తెలిపారు. పార్టీ అధినాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని అన్నారు.