Weight Loss | అధిక శరీర బరువు కారణంగా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆరోగ్యం మీద స్పృహ రావడంతో చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు తగ్గాలి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది కఠిన వ్యాయామాలు, తీవ్రమైన జిమ్ సెషన్ లు, వేగంగా నడవడం. కఠినమైన వ్యాయామాలు చేస్తేనే బరువు తగ్గుతారని చాలా మంది భావిస్తారు. కానీ వ్యాయామం కాకుండా రోజువారీ పనుల ద్వారా కూడా చాలా క్యాలరీలు ఖర్చవుతాయని మీకు తెలుసా.. దీనినే NEAT( Non- Exercise Activity Thermogenesis) అంటారు. అంటే వ్యాయామం కాకుండా రోజు వారీ జీవితంలో చేసే చిన్న చిన్న పనుల ద్వారా ఖర్చయ్యే క్యాలరీలు అన్నమాట. ఈ చిన్న చిన్న కార్యకలాపాలు కూడా బరువు నియంత్రణలో పెద్ద పాత్ర పోషిస్తాయి.
రోజు వారీ శక్తి వినియోగంలో దాదాపు 60 శాతం రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ద్వారా, సుమారు 10 నుండి 15 శాతం డైట్ థర్మోజెనిసిస్ ద్వారా జరుగుతుంది. మిగిలిన 15 నుండి 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ శక్తి శారీరక కదలికల వల్ల ముఖ్యంగా NEAT వల్ల వినియోగం అవుతుంది. NEAT అనేది నిద్ర, తినడం లేదా ప్లాన్ చేసిన వ్యాయామం కాకుండా అన్ని శారీరక కదలికలను సూచిస్తుంది. ఇంట్లో నడవడం, మెట్లు ఎక్కడం, తోట పనులు, నిలబడి పని చేయడం, ఇంటి పనులు, సరుకులు మోయడం వంటి పనులను ఇది సూచిస్తుంది. ఇలాంటి చిన్న పనుల ద్వారా కూడా చాలా క్యాలరీలను ఖర్చు చేయవచ్చు. బరువు తగ్గడం అంటే తీసుకునే క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేయడం. వర్కౌట్లు చేయడం వల్ల క్యాలరీలు ఖర్చు అయినప్పటికి ఇది చాలా చిన్న భాగమే అని చెప్పవచ్చు. కొంతమంది రోజంతా ఎక్కువ కదులుతూ ఉంటారు. కొంత మంది ఎక్కువ సమయం కూర్చొని ఉంటారు.
NEAT ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఎక్కువగా కదిలే వ్యక్తులు రోజుకు 1500 నుండి 2000 క్యాలరీల వరకు ఖర్చు చేయవచ్చు. జీవనశైలిని బట్టి ఖర్చయే క్యాలరీల సంఖ్య మారుతూ ఉంటుంది. కూర్చోవడం కంటే నిలబడడం ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేస్తుంది. లిప్ట్ ను వాడడం కంటే మెట్లు ఎక్కడం, ఫోన్ లో మాట్లాడుతూ నడవడం వంటి వాటి వల్ల క్యాలరీలు ఎక్కువగా ఖర్చు అవుతాయి. దాదాపు 200 నుండి 800 క్యాలరీలను పనుల ద్వారా ఖర్చు చేయవచ్చు. ఇటువంటి చిన్న పనులు వ్యాయామంలా అనిపించకపోయినా కాలక్రమేణా పెద్ద మార్పులు తీసుకువస్తాయి. వ్యాయామం చేయడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ ఒక గంట సమయం జిమ్ లో వ్యాయామం చేసి 8 నుండి 10 గంటల పాటు కూర్చుని పని చేయడం వల్ల ఫలితాలు ఎక్కువగా ఉండవు. కనుక కొన్ని సులభమైన మార్గాల ద్వారా NEAT ను పెంచుకోవచ్చు.
భోజనం చేసిన తరువాత కొద్ది సమయం నడవడం, మెట్లు ఉపయోగించడం, ఫోన్ లో మాట్లాడుతూ నడవడం, ప్రతి గంటకు ఒకసారి లేచి నిలబడడం, ఇంట్లో చిన్న చిన్న పనులు చేసుకోవడం, స్టాడింగ్ డెస్క్ ఉపయోగించుకోవడం వంటి వాటి వల్ల క్యాలరీలను మరింత ఎక్కువగా ఖర్చు చేసుకోవచ్చు. NEAT వల్ల మెటబాలిక్ ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. రక్తప్రసరణ బాగుంటుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఎక్కువగా డెస్క్ జాబ్ చేసే వారికి, కఠినమైన వ్యాయామాలు ఇష్టపడని వారికి, బరువు తగ్గడం ప్రారంభించే వారికి NEAT ప్రయోజనకరంగా ఉంటుంది. NEAT ఎప్పుడూ చేసే వ్యాయామంలా కనిపించకపోయినా బరువు తగ్గడంలో, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది చాలా ప్రభావవంతమైన పద్దతి అని నిపుణులు తెలియజేస్తున్నారు.