మంచినీళ్లు, కాఫీ, టీలు ఎక్కడికి వెళ్లినా డిస్పోజబుల్ గ్లాసుల్లోనే. ఒక్కసారి వాడిపడేసే వీటితో పర్యావరణానికి ఎంతో ప్రమాదం ఏర్పడుతున్నది. అలాగని ఎక్కడికి వెళ్లినా స్టీల్ గ్లాసులో, గాజు కప్పులో వెంట తీసుకెళ్లడం సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటప్పుడు అటు మన అవసరాలు తీరుస్తూ ఇటు ప్రకృతికి మేలు చేసేలా మార్కెట్లో దొరుకుతున్నాయి పోర్టబుల్ సిలికాన్ లీఫ్ వాటర్ కప్పులు. ఫుడ్ గ్రేడ్ సిలికాన్తో చేసిన ఇవి అరచేయి అంత పరిమాణంలో ఆకులా ఉంటాయి . దీన్ని మధ్యకి నొక్కితే గ్లాసులా తెరుచుకుంటుంది.
తర్వాత మళ్లీ మడత పెట్టి బ్యాగ్లో పెట్టుకోవచ్చు. వేడి, చల్లని పానీయాలకు ఇవి అనుకూలంగా ఉంటాయి. ట్రావెల్, ట్రెకింగ్, క్యాంపింగ్లకు ఇది చాలా ఉపయోగకరం. రంగురంగుల్లో ఆకర్షణీయంగా ఉండే వీటిని మనం కొనుక్కున్నా, ఎవరికైనా కానుకగా ఇచ్చినా పర్యావరణానికి ఎంతో కొంత మేలు చేసినట్టే!