హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన నిరంకుశ జీవో 97 ద్వారా సాంకేతిక విద్యా వ్యవస్థను ధ్వంసం చేస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ జీవో ప్రతులను చించివేసి నిరసన వ్యక్తంచేశారు. శాసనమండలిలో శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై మాట్లాడారు.
దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన మల్టీలేయర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ను ఈ ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నదని మండిపడ్డారు. జీవో 97 సాధారణ జీవో కాదని, రాష్ట్రంలోని దాదాపు లక్ష మంది పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల బిడ్డల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. దశాబ్దాల బహుళ అంచెల సాంకేతిక విద్యా వ్యవస్థను కనీస చర్చ లేకుండా రద్దు చేయడం క్షమించరాని నేరమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ వ్యవస్థను పీపీపీ మోడల్లోకి నెట్టి క్రమంగా ప్రైవేటీకరించే ప్రమాదం ఉన్నదని దాసోజు శ్రవణ్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ప్రైమ్ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే విద్యార్థులపై నిర్బంధాన్ని ఆపాలని, జీవో 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ స్వయంప్రతిపత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు.