ప్రస్తుతం తల్లి కాబోతున్న అనుభూతిని ఆస్వాదించే పనిలో ఉన్నారు అగ్ర కథానాయిక సమంత రూత్‌ప్రభు. నిరంతరం మీడియా ద్వారానో.. లేక సోషల్ మీడియా ద్వారానో అభిమానులకు చేరువగా ఉండే సామ్.. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విశేషాలను ఆమె పంచుకున్నారు. ‘ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు అప్పట్లో నన్ను కృంగదీశాయి. అనారోగ్యంతోనే ‘సిటాడెల్’లో నటించాను. నేనే కావాలంటూ వారు పట్టుపట్టడం వల్ల చేయక తప్పలేదు. ఒకానొక సమయంలో పూర్తిగా నటనకు స్వస్తి పలకాలని అనుకున్నా. అయితే.. నా జీవనాధారం నటనే. వదిలేస్తే ఆదాయం ఆగిపోతుంది.
సంపాదించిన డబ్బు కొన్నాళ్లకు కరిగిపోతుంది. ఏం చేయాలి? అని చాలా ఆలోచించా. దీనికి తగ్గట్టు.. వైద్యులు కూడా మరేదైనా వృత్తి చూసుకోండంటూ సలహా ఇచ్చారు. అందుకే.. ఉన్న డబ్బుతో నమ్మకం ఉన్న వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాను. వ్యాపారవేత్తగా మారాక, ఆ జీవితాన్ని కూడా బాగానే ఎంజాయ్ చేశాను’ అని తెలిపారు సమంత. ఇంకా చెబుతూ “మా ఇంటి బంగారం’ సినిమాకు నిర్మాతగా మాత్రమే వ్యవహరించాలనేది నా ఆలోచన. కానీ నేనే చేయాలంటూ రాజ్ బలవంతం పెట్టాడు. తన పోత్సాహం వల్లే ‘మా ఇంటి బంగారం’లో నటించాను. ఆ సినిమా మానసికంగా నన్ను బలపరిచింది. ఇప్పుడైతే నాలో చాలా మార్పు వచ్చింది. ఇదివరకు ప్రతిదానికీ ఫీలయ్యేదాన్ని. ఇప్పుడైతే అనవసరపు మాటల్ని పట్టించుకోవడం మానేశా. నా గురించి నెగెటివ్‌గా మాట్లాడాలని ఇతరులు ఫిక్స్ అయ్యాక, వారిని మార్చాలని ప్రయత్నించి నా టైమ్‌ని వృథా చేసుకోలేను. దానికంటే ముఖ్యమైన పనులు నాకు చాలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చారు సమంత.