సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పౌరుడిపై ప్రభుత్వం ఏ ఒక కోణంలోను కరుణ చూపడం లేదు. ఇప్పటికే భూముల ప్రభుత్వ విలువలను పెంచేసి రిజిస్ట్రేషన్ల భారాన్ని మోపింది. సొంతింటి కల నిజం చేసుకోవాలనుకునే సగటు మధ్య తరగతి ప్రజలపై రిజిస్ట్రేషన్ల భారం ఇప్పటికే నడ్డి విరిచింది.. ఆ భారం నుంచి కోలుకోకముందే, త్వరలో ట్రై కార్పొరేషన్లలో ఒకే పన్ను విధానం అమల్లోకి తీసుకువచ్చేందుకు సిద్ధమైంది. కాగా శుక్రవారం అసెంబ్లీలో క్యూర్ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ సెషన్ ముగింపులో ఈ బిల్లుపై ఆమోదం తెలిపిన వెంటనే బిల్లులో పొంది పరిచిన ప్రకారం ఆస్తిపన్ను భారం మోపనుంది. ఇదే జరిగితే ఇప్పటి వరకు ఉన్న ‘వార్షిక అద్దె విలువ’ స్థానంలో, ఇకపై క్యాపిటల్ వ్యాల్యూ’ ఆధారంగా ఆస్తి పన్నును లెకించనున్నారు. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆదాయాలు పెరగక, మరోవైపు పెరిగిన జీవన వ్యయంతో కొట్టుమిట్టాడుతున్న సగటు పౌరుడిపై ఈ ‘క్యాపిటల్ వ్యాల్యూ’ పన్ను విధానం కోలుకోలేని దెబ్బ కానుంది. ఇటు అద్దెకు ఉండేవారిపై కూడా ఈ ప్రభావం పడనుంది.
యజమాను లు పన్నుల భారాన్ని అద్దెల రూపంలో సామాన్యులపైకి నెట్టే ప్రమాదం ఉంది. ఆదాయ వనరులను పెంచుకునేందుకు ప్రజల రక్తాన్ని పిండటమే లక్ష్యంగా ప్రభుత్వం సాగిస్తున్న ఈ పన్నుల వేటపై గ్రేటర్ పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాగా క్యూర్పై అభిప్రాయాలు సేకరించగా..అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సామాన్యుడిపై అదనపు భారం పడకుండా బిల్లులోని వివాదాస్పద సెక్షన్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బిల్లులోని సెక్షన్ 76, 78, 79 ప్రకారం ఆస్తి పన్నును మారెట్ విలువల ఆధారం గా లెకించి, ప్రతి ఏటా గరిష్ఠంగా 20 శాతం వరకు ఆటోమేటిక్గా పెంచేలా ప్రతిపాదించడాన్ని సైబర్ సిటీ రెయిన్ బో విస్టాస్ రాక్ గార్డెన్ రెసిడెన్షియల్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, యూడీఎఫ్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు అంశాలకు సవరణలకు డిమాండ్ చేసిన ప్రభుత్వం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా సామాన్యుడి నడ్డి విరిచేలా బిల్లు తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
పౌరులపై ప్రభుత్వం మరో పన్నుల పిడుగు వేయడానికి సిద్ధమైంది. ట్రై కార్పొరేషన్లు (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ప్రభుత్వం కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేడెట్ గవర్నెన్స్) బిల్లు -2026 క్యూర్ బిల్లు అమల్లోకి వస్తే గ్రేటర్ పరిధిలోని 19.49 లక్షల మంది ఆస్తిపన్ను యజమానులపై పన్నుల భారం రెట్టింపు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం నగరంలో నివాస, వాణిజ్య సముదాయాలకు వాటి విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి వచ్చే అద్దె ఆధారంగా నామమాత్రంగా పన్నులు విధిస్తున్నారు. కానీ కొత్త విధానం ప్రకారం.. ఆయా ప్రాంతాల్లో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ విలువ లేదా మారెట్ రేట్ల ఆధారంగా పన్ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఐటీ కారిడార్, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఒక సాధారణ ఇంటి మారెట్ విలువ కోట్లలో ఉంటుంది. ఇప్పుడు కొత్త చట్టం వల్ల ఆ భారీ ‘క్యాపిటల్ వ్యాల్యూ’పై పన్ను లెకగడితే, ఏటా కట్టే ఆస్తి పన్ను భారం ఊహించని స్థాయికి చేరుకుంటుంది. దీంతో ఇటు సొంత ఇల్లు ఉన్న వారు, అటు అద్దె ఇళ్లల్లో ఉండే సామాన్యులు కూడా పెరగబోయే అద్దెల భారాన్ని తలచుకుని గుండెలు బాదుకునే పరిస్థితి రాబోతుండడం గమనార్హం.