సిటీ బ్యూరో, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): కాలువల్లో పారాల్సిన మురుగు రోడ్డెక్కింది. ఇండ్ల నుంచి వచ్చే వ్యర్థ జాలలు నాలాలోకి వెళ్లకుండా రహదారిపై ఏరులై పారుతున్నాయి. నెలల తరబడిగా ఇండ్ల నుంచి వస్తున్న మురుగుంతా ప్రధాన రహదారిపై పారడంతో ఆ దారంతా బురదమయం అవుతున్నది. రోడ్డును కప్పేసిన మురుగుపై వెళ్తున్న వాహనదారులు దుర్వాసన భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆ దారిలో ప్రయాణించాలంటేనే అవస్థలు పడుతున్నారు. నందిహిల్స్‌కు చెందిన బీఎన్ఆర్ సొసైటీ నుంచి వచ్చే మురుగు నీరుతో షేక్‌పేట, రాయదుర్గం ప్రధాన రహదారి నిండిపోతున్నది. వర్షం కురిస్తే వరద నీటితో పాటు మురుగు నీరు కలిసిపోయి రోడ్డంతా నిండిపోతున్నది. ఆ దారిలో పాదచారులు నడవలేనంత నీరు చేరుతున్నది. ప్రధాన దారిపైకి బీఎన్ఆర్ కాలనీ నుంచి మురుగు నీరు రాకుండా నివారించాలని వాహనదారులు, పరిసర ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
పైపు ద్వారా రోడ్డుపైకి…
బీఎన్ఆర్ హిల్స్ సొసైటీలోని ఇండ్లలోంచి వచ్చే మురుగును పైపు ద్వారా రోడ్డుపైకి వదులుతున్నారు. బీఎన్ఆర్ హిల్స్ సొసైటీ ఎత్తయిన ప్రాంతంలో ఉండటం వల్ల గృహ వ్యర్థాలను బయటకు వదిలేందుకు ఓ పైపును ఏర్పాటు చేసి, మురుగునంతా ఏండ్ల తరబడిగా పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలోకి వదులుతున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.దుర్వాసన భరించలేకపోతున్నామని వాహనదారులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే మురుగును నియంత్రించి ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.