హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వైద్య శాఖలో అవినీతి పతాక స్థాయికి చేరింది. కీలక విభాగంలోని కింది స్థాయి అధికారి సాగిస్తున్న అవినీతి దందా ఇందుకు సాక్ష్యం. గతంలో రోస్టర్ విధానం అమల్లో అవకతవలకు పాల్పడి, సస్పెన్షన్‌కు గురైన కింది స్థాయి అధికారి వైద్యశాఖలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. సస్పెన్షన్ వేటు పడినా సరే పైరవీలు చేసుకుని సదరు కిందిస్థాయి అధికారి వైద్య శాఖలోని కీలక విభాగంలో పాతుకుపోయాడు. శాఖపై పట్టు సాధించి వసూళ్ల దందాకు తెగబడుతున్నాడు. కీలక అధికారిని తన గుప్పిట్లో పెట్టుకుని వైద్యశాఖలోని ఓ విభాగాన్ని శాసించే స్థాయికి చేరుకున్నాడు. ఏండ్లుగా సదరు శాఖలో పాతుకుపోయి కీలక విభాగం హెడ్ ఆఫీసులో వైద్యులనే అధికారులుగా రాకుండా తన పరపతితో అడ్డుకుంటున్న తీరు విస్మయానికి గురిచేస్తున్నది. ప్రమోషన్‌పై ఎవరైనా హెడ్ ఆఫీసు రావాలనుకుంటే, వారిని అడ్డుకునేందుకు వారికి చార్జిమెమోలు ఇప్పిస్తున్నాడని సమాచారం. క్యాడర్, డిమాండ్ ఉన్న ప్లేస్‌ను బట్టి ఒక్కో ప్రమోషన్, సరెండర్ కేసు, డిప్యుటేషన్‌కు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సదరు కింది స్థాయి అధికారి తనకు ప్రమోషన్ వచ్చినా.. వెళ్లకుండా అదే శాఖలో తిష్ట వేశాడు. ప్రమోషన్‌పై వెళ్తే జీతం వేలల్లో మాత్రమే పెరుగుతుందని, ఇక్కడే ఉంటే శాఖ మొత్తాన్ని తన చెప్పుచేతల్లో ఉంచుకుని లక్షల్లో కొల్లగొట్టవచ్చని ఎత్తుగడ వేశాడని భావిస్తున్నారు. సదరు శాఖలో అధికారులు, వైద్యులు, సిబ్బందిని ఈ అవినీతి జలగ పీల్చి పిప్పిచేస్తున్నాడని సొంత శాఖ అధికారులే బాహాటంగా చెప్తున్నారు. ఈ కింది స్థాయి అధికారి కీలక శాఖలో అన్నీ తానై వ్యవహరిస్తూ ప్రమోషన్లకు రూ.లక్ష, డిప్యుటేషన్‌కు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలు, సరెండర్ కేసులకు రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నాడని తెలిసింది. చిన్నాచితక ఫైళ్లు క్లియర్ చేసేందుకు రూ.50 వేలు వసూలు చేస్తున్నాడని సమాచారం. ఇలా ప్రతినెలా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వసూలుకు పాల్పడుతున్నాడని సదరు కింది స్థాయి అధికారిపై ఆరోపణలున్నాయి. తాను వసూలు చేసిన మొత్తంలో సింహభాగం సదరు కీలక విభాగాధిపతికి ముట్టజెప్తున్నాడని తెలిసింది. వైద్య శాఖ పెద్దల అండదండలతోనే ఈ మొత్తం వ్యవహారాన్ని వీరిద్దరూ కలిసి సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధనల ప్రకారం సదరు శాఖలో పది మంది ప్రొగ్రామ్ ఆఫీసర్లు ఉండాలి. ఆయా స్థానాల్లో కేవలం మూడు స్థానాలను భర్తీ చేసి అందులో సైతం తన క్లాస్మేట్, తెలిసిన వాళ్లనే నియమించుకున్నాడని తెలిసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎవరైనా అధికారిపై ఆరోపణలకు సంబంధించి పేపర్లలో వార్తలు రాగానే సదరు కింది స్థాయి అధికారి రంగంలోకి దిగుతాడని సమాచారం. ఆ వార్త క్లిప్పింగ్‌ను అదే అధికారికి పంపి చార్జిమెమో ఇస్తామని బెదిరిస్తున్నాడని తెలిసింది. ఇక చార్జిమెమో ఇవ్వొద్దంటే ఒక రేటు, ఇచ్చిన చార్జిమెమో రద్దు చేయడానికి ఒక రేటును కింది స్థాయి అధికారి ఫిక్స్ చేసినట్టు తెలిసింది. ఇందుకు తనను కలిసి ప్రసన్నం చేసుకోవాలని సదరు కింది స్థాయి అధికారి కండిషన్ పెట్టాడని సమాచారం. అధికారికంగా కొన్ని డిప్యుటేషన్లు ఓరల్‌గా మరికొన్ని డిప్యుటేషన్లు ఇచ్చుకుంటూ తన వసూళ్లను యథేచ్ఛగా కొనసాగిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఒకవేళ ఎవరిదైనా డిప్యుటేషన్ ఫైల్ ఆలస్యం అయితే.. సంబంధిత జిల్లా ఇన్చార్జులకు ఫోన్ చేసి ‘కీలక అధికారి ఆర్డర్.. డిప్యుటేషన్ ఇవ్వాల్సిందే’ అంటూ ఓరల్గానే ఆదేశాలు ఇస్తున్నాడని తెలిసింది. సదరు శాఖ కీలక అధికారి సైతం తన వద్దకు ఎవరైనా వస్తే.. ముందు కింది స్థాయి అధికారిని కలిసి మాట్లాడాలని కండిషన్ పెడుతారని సొంత శాఖ సిబ్బందే చెప్తున్నారు. అక్కడినుంచే సెటిల్మెంట్ ప్రాసెస్ ప్రారంభమవుతుందని వారంటున్నారు. సదరు కింది స్థాయి అధికారి వసూళ్లలో ఏసీబీకి చిక్కకుండా కొత్త పంథాను ఎంచుకున్నాడని తెలిసింది. ఉదయం 8-9 గంటలకే అవినీతి అధికారి కోఠి క్యాంపస్‌కు చేరుకుని వసూళ్ల దందాకు పాల్పడుతున్నాడని తెలిసింది. ఏసీబీకి చిక్కకుండా లంచం ఇవ్వజూపే వాళ్లను ఒకచోట నుంచి మరో చోటకు తిప్పుతూ ఇలా నాలుగైదు ప్లేస్‌లు మార్చి చివరగా ఎవరూ లేని చోటు చూసి డబ్బులు తీసుకుంటున్నాడని తెలిసింది. వైద్య శాఖలో ఈ స్థాయిలో అవినీతికి తెగబడుతున్న కింది స్థాయి అధికారిపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న వైద్య శాఖ పెద్దలు ఎవరో..? తేలాల్సి ఉన్నది.