అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే
తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్
(భగవద్గీత- 12-6/7)
‘ఎవరైతే ఏకాగ్ర మనస్కులై, అనన్య భక్తితో నన్నే ధ్యానిస్తూ ఆరాధిస్తారో.. వారిని సంసార సాగరం నుంచి ఉద్ధరిస్తాను’ అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. ‘నన్ను ధ్యానించు.. ఆరాధించమ’ని చెప్పడం ద్వారా. భగవద్ధ్యానాన్ని యోగంగా భావిస్తూ పూర్తి భక్తిభావనతో.. స్థిర చిత్తంతో, సంశయానికీ, భయానికీ అతీతంగా ఆరాధించిన వారు.. ఏ స్థానం నుంచి భూమిపైకి వచ్చారో.. ఆ స్థానాన్ని తిరిగి పొందుతారని భావించాలి. భగవంతుడిని ఆశ్రయిస్తే.. సకల బాధలూ తొలగిపోతాయి. భగవంతుని నిరాకార రూపాన్ని అర్చించడం కన్నా సాకార రూపాన్ని ఆరాధించడం వల్ల ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. చేసే పనినే భగవదర్చనగా భావిస్తూ పూర్తి విశ్వాసంతో, ఏకాగ్ర మనస్కులై, ఫలితానికి అతుక్కుపోకుండా, సేవాభావనతో పనిచేసే వారికి ఫలితం అందుతుంది. సేవాభావన అంటే అందుకునే ప్రతిఫలానికి సరిపోయేంతగా పనిచేయడం కాకుండా.. ఎక్కువ సేవలను అందించడం. అదే సమర్పణా భావన. ఎక్కువగా సమర్పించడం అంటే ఎక్కువగా పొందడమే.
అయితే, మనలను ఇతరులతో పంచుకోవడంలో నిరోధిస్తున్నది ఏమిటి? ఎందుకని మనం ఇతరులపై ఆధిపత్యాన్ని చాటేందుకు ఇష్టపడుతున్నాం? మనలోని శాంతిని గుర్తించలేక బాహ్యంగా శాంతిని ఎందుకు వెతుక్కుంటున్నాం? స్థూలంగా ఎన్ని చెప్పుకొన్నా వీటన్నింటికి మూలకారణం భయం.. ఆకలి. వాటినుంచి విముక్తిని ప్రసాదించేది.. యోగమే. నిజానికి యోగం అంటే భగవంతునితో అనుసంధానం కావడం. దానికి మార్గం భౌతిక జీవితంలోని వాసనల నుంచి విముక్తిని పొందడమే! భయాన్ని, ఆకలిని జయిస్తే.. అంటే అవగాహన చేసుకుంటే.. కలిగేది శాంతి. అదే అనంతమైన ఆనందం. దాన్ని సాధించిన వ్యక్తి కర్మలను ఆచరించినా దానికి అతుక్కుపోడు, కర్మ ఫలాన్ని పొందడు.
గీత ఎప్పుడూ ‘పనిచేయు ఫలితం ఆశించకు’ అని చెప్పదు. సూర్యోదయంలో సూర్య కిరణాల నుంచి తప్పుకోవడం ఎలాగైతే అసాధ్యమో అలాగే కర్మ చేయడం నుంచి తప్పుకోవడమూ అసాధ్యమే! కాబట్టి చేసే పనిని సంపూర్ణమైన స్పృహతో చేయమంటుంది. విలువైన వనరులను, సమయాన్ని, శక్తిసామర్థ్యాలను వెచ్చించి చేసే పనిని ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేయడం నిరర్థకము. అప్పుడేది ఉత్తమమైన పని? ఒకపని ఉత్తమమైనదని మరొకటి కాదని భావించలేం. అది ఎవరికి వారే.. వారి బలాబలాలను, శక్తియుక్తులను, నైపుణ్యాలను తెలుసుకొని నిర్ణయించుకోవలసిన అంశమే కాని, అందరూ చేస్తున్నారు కాబట్టి ఉత్తమమైనదని భావించలేం. సంపూర్ణ స్పృహతో, ఇష్టపడి ఎన్నుకున్న పనిని ఉపాసనా భావనతో అనుష్ఠించే వ్యక్తి ఆ పనిని ప్రేమిస్తాడు. అతనికి ఆ పనే ప్రేరణ నిస్తుంది. ఆ పనినే ప్రతిఫలంగా భావిస్తాడు. దానితో వచ్చే ఫలితాన్ని ప్రసాదంగా, ఆరాధనా భావనతో స్వీకరిస్తాడు.
మనిషి మనసు సకారాత్మకంగానూ, నకారాత్మకంగానూ ప్రవర్తిస్తుంది. నకారాత్మకమైన మనసు వినాశానికి దారితీస్తుంది. సకారాత్మక మనసు.. సమున్నత ఆవిష్కరణలను సాకారం చేస్తుంది. సంఘర్షణలలోనూ సామరస్యతను సాధిస్తుంది. స్థిర నిశ్చయాన్ని, తపనను, లక్ష్యాన్నీ అనుగ్రహించేదీ మనసే. మానవ హననానికి దోహదపడేదీ మనసే. కోరికలకు నిలయమైన మనసు.. కోరికలను త్యజించిన మనసు.. రెండూ మనిషిలో సహజీవనం చేస్తుంటాయి. దేనిని ఆదరిస్తామో తదనుగుణమైన ఫలితాన్ని పొందుతాం.
సర్వ సమర్పణా భావనే భక్తి గాని యాంత్రికంగా తీర్థయాత్రాదులకు వెళ్లడమో, భజనాది కార్యక్రమాలలో పాల్గొనడమే భక్తిగా భావించలేం. ఒకవ్యక్తి నదిలో స్నానాన్ని ఆచరించి.. నా పాపాలన్నింటినీ నీవు తీసుకున్నావు కదా అని నదిని అడిగాడట! తీసుకున్నానని చెప్పిందట నది. వాటిని ఏం చేస్తావని అతను మళ్లీ అడిగాడట. సముద్రునిలో కలిపేస్తానన్నది నది. సముద్రుడిని అదే ప్రశ్న వేశాడతను. మేఘాలకు ఇస్తానన్నాడు సముద్రుడు. మేఘాలనూ అదే ప్రశ్నిస్తే.. వర్షరూపంలో మీకే ఇస్తానన్నాయట. కాబట్టి యాంత్రికంగా చేసిన పని వల్ల దేనిని విడిచిపెట్టామో.. తిరిగి అదే మనలను పలకరిస్తుంది.
– పాలకుర్తి రామమూర్తి