హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): సముద్ర మథనంలో ఉద్భవించిన గరళాన్ని గొంతులో నింపుకొని విశ్వాన్ని కాపాడిన పరమ శివుడిలా బీఆర్ఎస్ పై జరిగిన ఎన్నో కుట్రలు, కుతంత్రాలను తనలోనే దాచుకుంటూ తెలంగాణను సాధించిన కేసీఆర్ మరో గరళకంఠుడని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ అభివర్ణించారు. శ్రీశైలం మల్లికార్జునుడి అనుగ్రహంతో ఆ మహానేత మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఆదివారం తన పుట్టినరోజును పురస్కరించుకొని శ్రీశైలం మల్లికార్జునస్వామిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్, ఆయన సతీమణి ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు వర్థిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్టు తెలిపారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ఆయన మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు ముందుచూపు లేకనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందని ఆరోపించారు.