ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్ : కేంద్ర ప్రభుత్వ విధానాలతో దేశంలో పత్తి రైతులకు ( Cotton farmers ) తీరని నష్టం వాటిల్లే అవకావముందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బండారి రవికుమార్ ( Bandari Ravikumar ) ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి కుశాన రాజన్న అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ప్రతి పంటపై ఉన్న 11 శాతం టారిఫ్‌ను సున్నాకు తేవడంతో దేశంలోని పత్తి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అమెరికా ( America ) లాంటి దేశాల నుంచి వచ్చే పదివేల కోట్ల పత్తి దేశానికి చేరే ప్రమాదం ఉందని, దీనితో దేశంలోని రైతుల పంట ధర తగ్గుతుందన్నారు. పెట్టుబడి దారి దేశాలకు సహకరించే విధంగా నరేంద్ర మోదీ ( Narendra Modi ) వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అమెరికాకు సహకరించే విధానంలో భాగంగా దేశ రైతులను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులతో పాటు, జిన్నింగ్ మిల్లుల యజమానులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత విధానాన్ని అమలు చేయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశంలో యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు.
రైతులకు యూరియా పంపిణీపై నిర్దిష్ట విధానం లేకపోవడమే కొరతకు కారణమన్నారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు పీఆర్సీ కోసం చేస్తున్న ఉద్యమానికి మద్దతు పలకనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు భూపాల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల కార్యదర్శులు సంకె రవి, దర్శనాల మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు దుర్గం దినకర్, కార్తీక్, రాజేందర్, ఆనంద్, టీకానంద్ పాల్గొన్నారు.