తాండూర్ : గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని తాండూర్ ( Tandoor ) మండలంలో శుక్రవారం వినాయక నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు మిన్నంటగా మండలంలో వినాయకుడికి ఘనంగా వీడ్కోలు పలికారు. 9 రోజుల పాటు పూజలందుకున్న ఏకదంతుడికి మండలంలోని ప్రముఖులు పూజలు చేసిన అనంతరం భారీ బందోబస్తు నడుమ శోభాయాత్రను ( Shobayatra ) ప్రారంభించారు.
అందంగా అలంకరించిన వాహనాలలో గణనాధున్ని కొలువుంచి వీధుల్లో ఊరేగించగా ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలికారు. ఆయా ఉత్సవ సమితిల సభ్యులు, యువకులు, మహిళలు, చిన్నారులు డప్పు చప్పుళ్ల మధ్య గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ కోలాటాలు, నృత్యాలతో మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఊరేగింపులు నిర్వహించారు.
ఐబీలో శ్రీ గణేష్ మండలి వినాయకుడి శోభాయాత్రలో సాంప్రదాయ నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. తమ గృహాల ముందుకు వచ్చిన శోభాయాత్ర రథాలను మహిళలు నీటితో కడిగి మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు. తాండూర్ సీఐ దేవయ్య ఆధ్వర్యంలో తాండూర్, మాదారం ఎస్సైలు డీ కిరణ్ కుమార్, సౌజన్య పోలీసుల భారీ బందోబస్తు నడుమ శోభాయాత్రలు ముందుకు సాగాయి.
మండల కేంద్రంలోని శ్రీ గణేష్ మండలి నిర్వహకులు నవరాత్రుల్లో పూజించిన లడ్డును వేలం వేయగా రూ.51,111లకు కొత్తపల్లి గ్రామానికి చెందిన తాండూరి బాపురావు రజిత దంపతులు కైవసం చేసుకున్నారు. బంగారు లక్ష్మి, గణపతి ప్రతిమలను రూ.77,777లకు మండల కేంద్రానికి చెందిన సూరినేని రవీందర్ రావు సరోజ దంపతులు, దుగ్యాల హనుమంతరావు రేఖరాణి దంపతులు ఇరువురు వేలంలో కైవసం చేసుకున్నారు. కలశాన్ని ఠాకూర్ ఉమ్రావ్ సింగ్ సుహాసిని దంపతులు రూ. 5,555 లకు దక్కించుకున్నారు.