పెన్‌పహాడ్, సెప్టెంబర్ 05 : సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బయాలజీ ఉపాధ్యాయురాలు మారం పవిత్ర జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైన విషయం తెలిసిందే. 2025 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా 44 మంది ఎంపికవగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు మారం పవిత్ర. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆమె అవార్డు స్వీకరించారు.
అమెరికా వంటి పాశ్యాత్య దేశాల్లో విద్యా విధానం ఎలా ఉందో విద్యార్థులకు స్పష్టంగా అర్థమయ్యేలా చేసేందుకు ‘విద్యా వారధి’ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారు. ‘విద్యా వారధి’ లో స్కూల్ పిల్లలు అమెరికాలోని విద్యార్థులతో ప్రతి అదివారం సాయంత్రం 7 గంటలకు జూమ్ ద్వారా ఇంటరాక్ట్ అవుతారు. అమెరికాలో విధ్యా బోధన తీరు, పదో తరగతి, ఇంటర్మీడియట్ తర్వాత ఎటువంటి ప్రవేశ పరీక్షలు ఉంటాయి మొదలైన విషయాలను అక్కడి విద్యార్థులతో మాట్లాడి తెలుసుకుంటారు. జీవశాస్త్రంలో ఆమె బోధన వినూత్నంగా ఉంటుందని విద్యార్థులు తెలిపారు. ప్రతి పాఠ్యాంశాన్నీ విద్యార్థులకు కళ్లకు కట్టినట్లు వివరిస్తారు. ప్రయోగాల్లో సాంకేతికతను వినియోగిస్తారు. విద్యార్థులు శ్రద్ధగా వినడంతో పాటు ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు.
2019లో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు. 2021లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు. టెక్ మహీంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించిన సైన్స్ ఉపాధ్యాయ పోటీల్లో ట్రాన్స్ఫార్మింగ్ అవార్డు. 2023లో నేషనల్ సైన్స్ డే సందర్భంగా సారాబాయి టీచర్ సైంటిస్ట్ నేషనల్ అవార్డును జమ్మూ కశ్మీర్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రవిశంకర్ చేతుల మీదుగా అందుకున్నారు. 2023-24లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు పొందారు. ప్రస్తుతం 2025లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన మారం పవిత్ర పదో తరగతి వరకు వేములపల్లి, తడకమళ్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివారు. ఇంటర్, డిగ్రీ మిర్యాలగూడలోని ప్రైవేట్ కళాశాలలో చదివారు. చివ్వెంల మండలం గుంపుల తిరుమలగిరికి చెందిన టీచర్ నాతాల మన్మథరెడ్డితో ఆమెకు వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో బీఈడీ, డీఈడీ పూర్తి చేసి 2008 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం సాధించారు. 2009లో మొదటగా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం యూపీఎస్ లో జీవశాస్త్ర ఉపాధ్యాయురాలిగా విధులు చేపట్టారు. 2012 నుంచి 2015 వరకు గోరెంట్ల జడ్పీహెచ్, ఆ తర్వాత గడ్డిపల్లి జడ్పీహెచ్లో, ప్రస్తుతం పెన్‌పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.