కుభీర్ : మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతోపాటు గర్భిణీలు, బాలింతలకు స్థానిక ఆరోగ్య కార్యకర్తలు ఆరోగ్య పరీక్షలు ( Health Check-Up ) నిర్వహించారు. రక్త నమూనాలు సేకరించి బీపీ( BP ), షుగర్ ( Sugar ) పరీక్షలు నిర్వహించారు. చిన్నారులకు బరువు ఎత్తు కొలతలు తీశారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి మాత్రలను పంపిణీ చేశారు. కంటి చూపు మందగించిన మహిళలకు స్థానిక ఎల్వీ ప్రసాద్ పరీక్ష కేంద్రానికి పంపించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కార్యకర్తలు సరస్వతి, మహిజా శుభ్రత, పోషకాహారం, రోగనిరోధక శక్తి పై అవగాహన కల్పించారు. తల్లి బిడ్డల సంరక్షణ, శుభ్రత, పోషణ కోసం ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, పాలు తీసుకోవాలన్నారు. రక్తపోటు, షుగర్ హీమోగ్లోబిన్ టెస్టులు చేయడంతో పాటు ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ టాబ్లెట్లు అందించారు. పుట్టిన ప్రతి బిడ్డకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీచర్ జి. సత్యశీల, కాలనీలోని మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.