సుహాస్, శివానీ నాగరం, సీనియర్ నరేష్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న కామెడీ ఎంటర్టైనర్ ‘హే భగవాన్’. గోపి అచ్చర దర్శకుడు. బి.నరేంద్రరెడ్డి నిర్మాత. ఈ నెల 20న సినిమా విడుదల కానుంది. బన్నీవాసు, వంశీ నందిపాటి కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు.
అగ్ర కథానాయకుడు సాయిదుర్గతేజ్ ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. మరో అతిథి డైరెక్టర్ రామ్ అబ్బరాజు సినిమా విజయంపై నమ్మకం వెలిబుచ్చారు. రీసెంట్గా ఫస్ట్‌కాపీ చూశానని, తప్పకుండా సక్సెస్ అవుతుందని నిర్మాత బన్నీవాసు నమ్మకం వ్యక్తం చేశారు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కథను ఊహించి చెప్పిన అయిదుగురికి 20వేలు ప్రైజ్ మనీ ఇవ్వబోతున్నామని, సుహాస్ కెరీర్లోనే ఇది అతిపెద్ద విజయం అవుతుందని వంశీ నందిపాటి ఆశాభవం వెలిబుచ్చారు. సుహాస్ మాట్లాడుతూ ‘ఆద్యంతం నవ్వులు పంచే సినిమా ఇది. నరేష్గారితో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం’ అని తెలిపారు.
ట్రైలర్ చూసి ఈ సినిమా పాయింట్‌ని గెస్ చేయలేరని, అందుకే ‘నాట్ ఎ ట్రైలర్’ పేరుతో ట్రైలర్ విడుదల చేశామని, తండ్రికొడుకుల ఎమోషన్స్‌తో సాగే ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని దర్శకుడు గోపీ అచ్చర అన్నారు. ఇంకా నరేష్, శివానీ నాగరం కూడా మాట్లాడారు.