కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లిలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో శుక్రవారం వీధి కుక్కల దాడిలో ( Dogs attack ) చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. మోడల్ స్కూల్ హాస్టల్ ఆవరణలో చిన్నారి చొప్పరి అక్షిత ( Akshita ) ఒకటవ తరగతి విద్యార్థిని. తన తల్లితో స్కూల్ ఆవరణలో ఉండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కుక్కల మంద చిన్నారిపై దాడి చేశాయి.
తల భాగం, శరీరంపై కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. దీంతో కుక్కలు దాడిని గమనించిన స్థానికులు వెంటనే ఆప్రమత్తమై కుక్కలను తరమేసి చిన్నారిని కాపాడారు. దాడిలో గాయపడ్డ ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తల భాగంలో గాయాలు తీవ్రంగా ఉండడంతో సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు కుటుంబీకులు తెలిపారు. ముత్యంపల్లిలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, కుక్కలను నివారించాలని స్థానికులు కోరారు.