‘రాష్ట్రంలో ఉన్నరా? కేంద్రంలో ఉన్నరా?’ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో బీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ఎద్దేవా ఇది! రాజకీయ పార్టీల మధ్య, నాయకుల మధ్య విసుర్లు, చతుర్లు సహజమే కానీ, తమ బాధ్యతల్ని తాము సక్రమంగా నెరవేరుస్తున్నపుడు ఎలాంటి విమర్శ అయినా అందగిస్తుంది. అట్లా కానప్పుడు అది మందగిస్తుంది, వక్రబుద్ధి లాగే! రెండు నెలలుగా యూరియా కోసం రైతాంగం రోడ్డుకెక్కింది. తిండి, నిద్ర మాని రైతులు తెల్లవారుజామునే యూరియా కోసం క్యూలు కడుతున్నరు. అక్కడే సొమ్మసిల్లి పోతున్నరు. తోపులాటలో రక్తాలు కారుస్తున్నరు. అధికారుల కాళ్ల మీద పడుతున్నరు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల గల్లా పట్టుకుంటున్నరు. అన్ని ఈతి బాధలకూ ముందుగా గురయ్యే మహిళలు రేవంత్‌రెడ్డిని బూతులు తిడుతున్నరు.
రాష్ట్రంలో ఉన్న రేవంత్‌రెడ్డి, కేంద్రంలో ఉన్న కిషన్‌రెడ్డి ఏం వెలగబెడుతున్నరో; బాధ్యత మరిచిన ఆ రెండు పార్టీలు ఏ గుడ్డి గుర్రాల పళ్లు తోముతున్నయో మరి! రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం; కేంద్రంపై రాష్ట్రం నెపం నెడుతూ కాలక్షేపం చేస్తున్నయి. కేంద్ర-రాష్ట్ర మంత్రుల మాటలు ఇక్కడ ఉటంకించడానికి కూడా మనస్సు రావడం లేదు. న్యూస్ ప్రింటు, ఇంకు, మీ సమయం, నా సమయం వృథా కాబట్టి! అంతటి పనికిమాలిన మంత్రాంగం నడుపుతున్నవి బీజేపీ-కాంగ్రెస్ కలిసి. జనం గోసపట్టనప్పుడు రాష్ట్రంలో ఉంటేనేమీ, కేంద్రంలో ఉంటేనేమీ, ఎంతమంది ఎంపీలు ఉంటేనేమీ, ఊరేగితేనేమీ కిషన్రెడ్డీ! అవతల చంద్రబాబు నాయుడును చూడండి. ఆల్రెడీ వాళ్ల దగ్గర 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉంది. నాలుగురోజుల క్రితం కాకినాడ పోర్టులో 18 వేల మెట్రిక్ టన్నులు దిగింది. వారంలో మరో 25 వేల మెట్రిక్ టన్నులు దిగబోతున్నది. మరి తెలంగాణలో ఎందుకు ఈ గోస? ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అని సాకులు చెప్తున్నరు ఎంపీ రఘునందన్. ఆంధ్రకు యుద్ధం అడ్డురాలేదా? చంద్రబాబుకు బీజేపీ అడిగిన తడవే అన్నీ ఇస్తున్నది. మరి తమతో సత్సంబంధాలు లేని కాలంలో కూడా కేంద్రం నుంచి కావాల్సిన యూరియా రాబట్టుకున్నరు కదా కేసీఆర్. ఆయన పాలనలో ఎప్పుడూ యూరియా గోస వినపడలేదు కదా?
కేసీఆర్‌కు భవిష్యత్ దృష్టి ఉంటది. వందేండ్ల తర్వాత దేశం ఎట్లా ఉండాలో మాత్రమే కాదు, ఆర్నెల్ల తర్వాత వాతావరణ స్థితి, పంటల పరిస్థితి, రైతాంగం మనస్థితి అన్నీ ముందే ఊహించగలరు ఆయన. ఇది కేసీఆర్ నిపుణతకు తార్కాణం మాత్రమే కాదు, జనం పట్ల ఆయన పట్టింపునకు నిదర్శనం.‘పని సాధించే విషయంలో కేసీఆర్ ఏ స్థాయికి అయిన వెళ్లిపోతరు. అందుకు బెస్ట్ ఉదాహరణ తెలంగాణ ధాన్యానికి సరిపోను గోనె సంచులు, లేవన్న విషయాన్ని నేషనల్ ఇష్యూ చేసి కేంద్రం మెడలు వంచి మూడు కోట్ల గన్ని బ్యాగ్స్ తెప్పించుకున్నరు’ అన్నరు అనిల్ కుమార్ వరగంటి అనే ఒక ప్రొఫెషనల్.
తెలంగాణలో బీఆర్ఎస్ పాలన ఉన్న కాలంలోనే మధ్యప్రదేశ్‌లో బీజేపీ పాలనలో యూరియా కోసం ఆందోళన చేస్తున్న రైతులపై కాల్పులు జరిగినయి. కేంద్రంలో కూడా బీజేపీనే. ఏయే రాష్ర్టాలు తమ బఫర్ స్టాక్ వాడుకోవడం లేదో తెలుసుకుని, అప్పటి కేంద్ర ఎరువుల మంత్రి అనంతకుమార్‌తో కూర్చొని, కింది స్థాయి రైల్వే అధికారులతో కూడా కూర్చొని తెలంగాణకు యూరియా తెప్పించిండ్రు కేసీఆర్. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా కేసీఆర్‌లా, కనీసం తన గురువు చంద్రబాబులా పని చేయాలని జనం కోరుకుంటున్నరు.
‘కేసీఆర్ ఎప్పుడు పంటుండెనో, ఏడ ఉంటుండెనో, ఏమి తింటుండెనో మాకెందుకు సార్. టైమ్‌కు యూరియా ఇస్తుండె, బ్యాంకులల్ల పైసలు పడుతుండె, నీళ్లు, కరెంటు కడుపునిండా ఇస్తుండె’- అన్న రైతు మాటలు మిర్రర్ టీవీలో చూసినం కదా! కృష్ణ అనే సూర్యాపేట యువకుడు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ‘మేము ఇక్కడ ఉద్యోగాల కోసం, ఊళ్లో అమ్మానాన్నలు యూరియా కోసం గోసపడుతున్నం’ అంటూ మొరపెట్టుకోవడం ఈ రాష్ట్ర దైన్యస్థితిని తెలియజేస్తున్నది కదా! ‘గ్రూప్-1 ఉద్యోగం కోసం 3 కోట్లు అడిగిండు ఒక మంత్రి’ అంటూ బాహాటంగా, ధైర్యంగా, ధర్మాగ్రహంతో మాట్లాడిన వీడియోలు వెలుగు చూసినయ్ కదా! ఎవరికి చెప్పుకోవాలి రక్షించమని? ఏమని మొరపెట్టుకోవాలి కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నవారిని!!
‘కన్నీటి బతుకుల కనలేని నాడు.. స్వామి కరుణామయుండన్న బిరుదేలనమ్మా…’ అంటూ వేంకటేశ్వరస్వామి గురించి అలమేలు మంగమ్మతో మొరపెట్టుకున్నరు భక్తులు. ఆయన ఆపదమొక్కులవాడు కాబట్టి ఆశ అయినా ఉంటుంది. రేవంత్ గురించి మీనాక్షమ్మకు చెప్పినా, రాహులయ్యకు మొక్కినా ప్రయోజనం లేదని ఎన్నో సంఘటనలు తేల్చేసినయి. ‘బట్టలు ఊడదీసి కొడితే ఇందిరమ్మ రాజ్యపు గొప్పతనం అర్థమైతది’ అంటూ ఆపదలు హక్కుగా అందించే ముఖ్యమంత్రే పబ్లిక్ మీటింగ్‌లో మాట్లాడినంక ఎవరిపై, ఏ ఆశలు పెట్టుకోగలం? తాము ఎంత అహంకారులమో, ఎంత నియంతలమో రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నరు. కిమ్మనని నిమ్మలా ఊకుంటూ ఊ కొడుతున్నరు రాహుల్‌గాంధీ.
దేశవ్యాప్తంగా ‘ఓట్ చోరీ’ గురించి జాతర చేస్తూ, తెలంగాణలో పాతర వేస్తున్నరు రాహుల్. ఓటుకు నోటు దొంగను సీఎం పీఠంపై కూర్చోబెట్టినప్పుడే ప్రజాస్వామిక విలువల పట్ల రాహుల్ నిబద్ధత, ఆయన విశ్వసనీయత బట్టబయలయ్యాయి. తన శిబిరంలోని పార్టీల పట్ల ఎంత అనాదరంగా ఆయన ఉంటరో ఇండీ కూటమి ముక్కచెక్కలు చెప్తున్నయి. ‘రాజ్యాంగ పరిరక్షణ’ అంటూ మాట్లాడే రాహుల్ మాటలు ఎవరూ నమ్మడం లేదు, మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలోనూ చెల్లలేదు.తాజాగా తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో న్యాయవ్యవస్థను, స్పీకర్ వ్యవస్థను, రాజ్యాంగాన్ని తీవ్ర అపహాస్యం చేస్తున్నది రాహుల్‌గాంధీయే. ఇపుడు ‘ఆ పది మంది’ ఎమ్మెల్యేలు తమది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోలేని దైన్యంలో ఉన్నరు.
లోపలి కారణాలు ఏమైనా, కనీసం పైకి ‘నియోజకవర్గ అభివృద్ధి’ కోసం చేరామనీ చెప్పుకోలేరు, అభివృద్ధి శూన్యం కాబట్టి. పోనీ వ్యక్తిగత ప్రయోజనాలు దక్కినయా అంటే అదీ లేదు. కులమూ పోయింది, సుఖమూ దక్కలేదు అన్నట్టు అయింది పరిస్థితి. కాంగ్రెస్‌ను కసికసిగా ఓడించేందుకు సిద్ధంగా జనం ఉన్నరు కాబట్టి రాజీనామా చేసి ఎన్నికలకూ పోలేరు; న్యాయవ్యవస్థ పట్టుబట్టి వారిని అనర్హులుగా ప్రకటించినా తిరిగి రాజకీయంగా బట్ట కట్టలేరు. కాబట్టి, తాము బీఆర్ఎస్ పార్టీయే అని బుకాయిస్తున్నరు. సమాచార విస్ఫోటనంతో జనానికి అన్ని విషయాలూ అరటిపండు ఒలిచినట్టు అర్థం అవుతున్నయనే కనీస ఇంగితం కూడా లేదు వారికి!
ఫిరాయింపులు మనకు కొత్త కాదు. అందరూ, అన్ని పార్టీలూ ఏదో సందర్భంలో చేసినవే, ప్రోత్సహించినవే. కానీ, రాజ్యాంగం అంటూ రాసుకున్నాక దాన్ని పాటించాలి కదా? ఫిరాయింపుల నిరోధక చట్టానికి దొరకనంత సంఖ్యలో ఫిరాయింపులు ఎందుకు జరగలేదు మరి? నాడు కేసీఆర్ హయాంలో జరిగినట్టు ఇప్పుడు ఎందుకు జరగలేదు? ఎందుకంటే… పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ, అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ, అంతిమంగా తన రాష్ర్టాన్ని సమున్నతంగా నిలబెట్టడంలోనూ కేసీఆర్‌కి, రేవంత్‌రెడ్డికి పోలిక లేదు కాబట్టి. నాడు ఫిరాయించిన వారు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిన రాష్ట్ర పురోభివృద్ధిలో భాగస్వాములు అయిన్రు కాబట్టి. ‘నేనూ గెలవను, కాంగ్రెస్ ప్రభుత్వమూ మళ్లా రాదు’ అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు బహిరంగంగా ప్రకటించిన ఉదంతం ఏం చెప్తున్నది? కాంగ్రెస్ సర్వభ్రష్టత గురించి కాదా? అలాంటి పార్టీని నమ్మిన జనం మోసపోయిన్రు, ఆ పది మంది ఎమ్మెల్యేలూ మోసపోయిన్రు.
తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటానన్న కేసీఆర్ వేరు. తెలంగాణను తాకట్టు పెట్టడానికి ఏ గడ్డి అయినా తింటాననే రేవంత్‌రెడ్డి వేరు. ఈ విచక్షణ, ఈ క్షీర-నీర న్యాయం తెలంగాణ మేధావి వర్గానికి తెలియాలి. కాంగ్రెస్ ఏదో దేశాన్ని ఉద్ధరించే పార్టీ అనే భ్రమలు వీడాలి. అన్ని వ్యవస్థలనూ తన ప్రభుత్వం తుంగలో తొక్కుతూ ఉంటే, దేశమంతా రాజ్యాంగం పట్టుకుతిరగడానికి సాహసించినందుకు రాహుల్‌గాంధీ సిగ్గుపడాలి. ఆ పదిమంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి పరువు నిలుపుకోవాలి. ప్రజాకంటకుడైన రేవంత్‌రెడ్డిని దించేసి పుట్టి పూర్తిగా మునగకుండా చూసుకోవాలి. గుడ్డి గుర్రాల పళ్లు తోమడం ఆపేసి, ప్రజాస్వామ్యాన్ని నిజమైన అర్థంలో పట్టించుకోవాలి.