Ramayanam | హైదరాబాద్‌లో నేనుంటున్న ఇంట్లో.. మా చిన్న చిన్నాయన వాళ్లు కొత్త జంట! అందుకే.. అప్పుడప్పుడూ వాళ్లిద్దరూ సినిమాలకు వెళ్లేవారు. ఇక గోపిక చిన్నమ్మ, రంగారావు చిన్నాయన వాళ్లకు అప్పటికే హరిత, శీను ఇద్దరు పిల్లలు. వాళ్లు ఎప్పుడో ఓసారి మాత్రమే సినిమాలు చూసేవారు. నన్ను కూడా ఒకట్రెండు సినిమాలకు తీసుకెళ్లారు.
నేను ఇంటర్లో చేరిన కొద్దిరోజులకే ‘ముత్యాల ముగ్గు’ అనే కొత్త సినిమా చాలా బాగుందనీ, అందరూ చూస్తున్నారనీ ఇంట్లో చెప్పుకొంటుంటే విన్నాను. తెలిసినవాళ్లో, బంధువులో ఒకరింటికి మరొకరు వెళ్లినపుడు.. మాటల్లో సినిమాల ప్రసక్తి తప్పక వచ్చేది. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఉన్నవాళ్లు రాత్రి పిల్లలు పడుకున్నాక.. ఇంట్లో పెద్దవాళ్లకు అప్పజెప్పి సెకండ్ షోకి వెళ్లేవాళ్లు. అలా ఓసారి.. “సిన్మాకు పోదాం, ఒస్తవా రమా!” అని చిన్నమ్మ అడగ్గానే తలూపాను. “నేనెందుకు చిన్నమ్మా!? మీరు పోండి” అనాలని నా బుర్రకు ఎందుకు తోచేది కాదో తెలియదు. అంత మొహమాటం ఉండేది.
నాకు పుస్తకాల పిచ్చి ఉండేది గానీ, సినిమాల పిచ్చిలేదు. మొత్తానికి వాళ్లవెంట సెకండ్ షోకి వెళ్లాను. మేము వెళ్లేసరికే సుదర్శన్ టాకీసు ఆవరణలో జనం కిక్కిరిసి ఉన్నారు. ఆ థియేటర్లో 70 ఎంఎంలో సినిమా చూడటం గొప్పన్నమాట. అప్పటివరకూ ఒక సినిమాకు అంత జనం రావడం నేను ఎరుగను. హాలు ఆవరణ నిండా రంగురంగుల పెద్ద ముగ్గులు వేసారు. ఇక టికెట్ కౌంటర్ల దగ్గర జనం లెక్కలేనంత మంది ఉన్నారు. అయితే మేము యాభై రూపాయల టికెట్స్ కొనడం వల్ల తొందరగానే దొరికాయి. అప్పుడు అదే ఎక్కువ
ధర టిక్కెట్టు. ఆ తరువాత పది నిమిషాల్లోనే హౌస్ ఫుల్ బోర్డులు పెట్టేసారు.
ఇక లోపల డోర్ దగ్గరికి వెళ్లగానే ఆశ్చర్యం! ఆడవాళ్లందరికీ ముగ్గుల పుస్తకాలతోబాటు పసుపు-కుంకుమ ప్యాకెట్లు అందజేస్తున్నారు. అవి పెద్దవాళ్లకేనేమో అనుకునీ.. నేనేం చేసుకుంటానులే అనుకునీ వద్దన్నాను. అప్పటికే నా చేతిలో పెట్టేసారు వాళ్లు. “పోనీలే! ప్రమీలకు ఇద్దాం” అని గోపిక చిన్నమ్మ చెప్పింది. సినిమా బాగుంది, పాటలు బాగున్నాయి. అందులో ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది’ అన్న పాట.. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గారు రాశారని తరువాత తెలిసి ఆశ్చర్యపోయాను. ఆయన కవిత్వం ‘ఋతుఘోష’ నేనప్పటికే మా ఊరి లైబ్రరీనుంచి తెచ్చి అర్థం కాకపోయినా చదివి ఉన్నాను. అప్పటిదాకా సినిమా పాటలు రాసేవాళ్లు వేరే, కవిత్వం రాసేవాళ్లు వేరే అని తెలుసు నా చిన్నబుర్రకు. కానీ, కవులకు సినిమా పాటలు కూడా రాయడం వచ్చని తెలుసుకున్నాను. ఎందుకంటే.. సినారె, దాశరథి గార్ల కవిత్వం ఆ తరువాత ఎన్నాళ్లకో చదివాను మరి!
అంతేకాదు, ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీధర్ వాళ్లిల్లు హైదరాబాద్‌లోని జ్ఞాన్ బాగ్ ప్యాలెస్‌లో తీసారనీ, ఆ భవనం రాజకుమారి ఇందిరా ధన్‌రాజ్ గిర్ వాళ్లదనీ, ఆమె ఇండో- ఆంగ్లియన్ కవయిత్రి అనీ, శేషేంద్ర శర్మ గారి భార్య అనీ, ఆయన కూడా అక్కడే ఉంటారనీ.. ఇలా ఎన్నో అనీలు ఏదో పేపర్లో చదివాను. కొన్ని నెలల క్రితం ప్రముఖ రచయిత్రి డి.కామేశ్వరి గారి ‘భవబంధాలు’ కథాసంపుటి ఆవిష్కరణ సమావేశం హైదరాబాదులో జరిగినపుడు.. ఆవిడ కోరిక మీద పుస్తక సమీక్ష నేనే చేసాను. ఆ సమావేశానికి ఇందిరా ధన్‌రాజ్ గిర్ వచ్చారు. ఆవిడని చూసి చాలా థ్రిల్ అయ్యాను. సభ అయ్యాక ఆమె నన్ను దగ్గరికి పిలిచి “బాగా మాట్లాడావమ్మా!” అని మెచ్చుకున్నప్పుడు.. నాకు మా ఇంట్లో జామచెట్టెక్కి దోర జామపండును కోసుకుని తిన్నంత ఆనందమయ్యింది.
ఇంతకన్నా థ్రిల్ మరొకటుంది. చాలా రోజులకు నాకు తెలిసిందేమిటంటే.. ముత్యాల ముగ్గు కథానాయిక సంగీత గారు మా హనుమకొండ ప్రాంతంలోనే పెరిగారనీ, ఇక్కడి పెట్రోల్ పంప్ ఏరియాలోని స్కూల్లోనే టెంత్ వరకూ చదువుకున్నారనీ, వాళ్ల నాన్నగారు వరంగల్‌లోని అజంజాహీ మిల్స్‌లో ఉద్యోగం చేసేవారనీ.. ఇలా మళ్లీ బోలెడన్ని అనీలు తెలిసాయి. అయితే.. నేనెన్నడూ ఊహించని విషయం ఏమిటంటే, అయిదేళ్ల క్రితం ఒకానొక సందర్భంలో నిజామాబాదుకు చెందిన రచయిత్రి, విద్యావేత్త అయిన డా. అమృతలత గారి ద్వారా సంగీత గారితో పరిచయం ఏర్పడింది. సంగీత గారు చాలా సౌమ్యులు, సహృదయులు కూడా. తనతో అప్పుడప్పుడూ ఫోన్లో పలకరించి మాట్లాడుకునేంత చనువు ఏర్పడింది నాకు.
నాయనమ్మ కూడా ఒక్కోసారి ఆదివారం “సిన్మాకు పోదామానే పిల్లా!” అనడిగేది. మోహినమ్మ నాయనమ్మ అంటే నాకు భయంతో కూడిన గౌరవం. పైగా ఎవరు అడిగినా ‘నో’ అని చెప్పలేని నేను.. నాయనమ్మ మాట ఎలా తీసేస్తాను? అందుకే “సరే!” అనేదాన్ని. పాపం, మా నానమ్మలాగానే ఈమెకు కూడా సినిమాలు ఇష్టమేమో అనుకునేదాన్ని. ఇంతకూ నాయనమ్మ తీసుకెళ్తే నేను వెళ్లే సినిమాలు ఏవంటే.. మార్నింగ్ షోలలో వేసే పాత నలుపు-తెలుపు సినిమాలు. తొందరగా అన్నం వండి పదకొండింటికే తినేసి, పదకొండున్నరకు మొదలయ్యే సినిమాకు నన్ను తీసుకెళ్లేది. పాతాళ భైరవి, మిస్సమ్మ, గుండమ్మ కథ, లవకుశ వంటి మంచి సినిమాలు, మూగ, మంచి, తేనె, కన్నె, నిండు వంటి మనసుల సినిమాలు కూడా.. నేను నాయనమ్మతోనే చూసాను.
పాటల సన్నివేశాల్లో హీరో-హీరోయిన్ కాస్త దగ్గరగా వచ్చి ఒకర్నొకరు తాకుతూ అతి చనువుగా ఉన్నారంటే చాలు.. “అబ్బ! ఏమి సిన్మాలే తల్లీ! అన్నీ చూపిస్తున్నరు. ఏమన్న దాపరికం ఉన్నదా? సిగ్గు లేనేలేదు!” అనేది నాయనమ్మ. అక్కడికీ పాత సినిమాల్లో ముద్దు సన్నివేశాలు చూపించేవారు కాదు. ఇద్దరూ ఏ చెట్టు చాటుకో వెళ్లి.. హీరోయిన్ మూతి తుడుచుకుంటూ రావడమో, ఇద్దరి ముఖాలు దగ్గరవగానే ఓ పూల గుత్తినో, ఆకాశంలో ఉన్న చందమామనో, పువ్వు మీద తుమ్మెద వాలడమో చూపించేవారు పాపం! అదీ కాకపోతే ఇద్దరి చేతివేళ్లు పెనవేసుకుని కెమెరాకు అడ్డుగా పెట్టడమో, మరొకటో గానీ.. ఏవో తిప్పలు పడేవారు. మొత్తానికి నా టీనేజ్ మొదట్లోనే మార్నింగ్ షోలలో మంచి సినిమాలు చూడటం వల్లనో ఏమో గానీ.. సినిమాలను విశ్లేషణాత్మకంగా చూడటం నేర్చుకున్నాను.
– నెల్లుట్ల రమాదేవి రచయిత్రి