ఒక్కో గ్రామానికీ ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాతావరణం, సుందర దృశ్యాలు మొదలు పండే పంటలు, వండే వంటల దాకా తమకంటూ విభిన్నతను సొంతం చేసుకుంటాయవి. అలాంటి వాటిలో ఒకటే మహారాష్ట్రలోని భిలార్ గ్రామం. అక్కడ ఇళ్లు, బళ్లు, గుళ్లు అన్నీ పుస్తకాలయాలుగానే కనిపిస్తాయి. ఆ దారులన్నీ అక్షరాల గురించే మాట్లాడుకుంటాయి. 35 వేలకు పైగా గ్రంథాలకు నెలవైన ఈ చోటు సాహితీ ప్రియులకు అత్యంత ప్రత్యేకం. దేశంలోనే మొట్ట మొదటి పుస్తకాల గ్రామంగా ఇది ప్రసిద్ధి చెందింది.
ఓ మంచి సినిమా చూస్తేనో, ఇష్టమైన పదార్థం తింటేనో, స్నేహితులతో కలిసి హాయిగా ముచ్చట పెట్టుకుంటేనో కలిగే అనుభూతి మంచి పుస్తకం చదివినా లభిస్తుందంటారు బుక్ లవర్స్. నిజమే పుస్తకం చెప్పే కబుర్లు చాలాసార్లు మనసుకు సాంత్వనను కలిగిస్తాయి. మెదడును ఉత్తేజితం చేస్తాయి. అయితే ఈ అనుభూతులు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయి. అంటే ప్రేమ కథలు చదువుతారా, దేశ రాజకీయాలు తెలుసుకుంటారా, స్ఫూర్తిదాయక వ్యక్తుల జీవితాలను పరికిస్తారా అన్నది వ్యక్తిగతం.
ఈ ఎంపిక ఎవరికి వారిదే. కళలు, సాహిత్యం, చరిత్ర, పురాణాలు, పరిశోధన, యాత్రా విశేషాలు, వైద్యం, విద్య… ఇలా విభిన్న కోవలకు చెందిన పుస్తకాలుంటాయి. అభిరుచులు, అవసరాలను బట్టి వీటిని చదువుతుంటారు చాలా మంది. అయితే ఇలాంటి అనేక రకాల పుస్తకాలను ఒకేచోట చేర్చాలన్న ఆలోచనతో 2017లో మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని భిలార్ గ్రామంలో అప్పటి ప్రభుత్వం ఏర్పరచిందే బుక్ విలేజ్. 35 వేలకు పైగా విభిన్న పుస్తకాలు ఇప్పుడిక్కడ కొలువయ్యాయి.
ప్రకృతి సౌందర్యానికి ఆలవాలమైన పంచ్ఘని, చారిత్రక ప్రదేశమైన మహాబలేశ్వరాల మధ్య సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో పొందికగా అమరి ఉంటుంది భిలార్ గ్రామం. స్ట్రాబెర్రీ పంటలకు అది ఆదినుంచీ ప్రసిద్ధం. అంతేకాదు మహారాష్ట్ర సాంస్కృతిక కళలతో ఈ గ్రామానికి అనుబంధం ఉంది. ఇక దీన్ని బుక్ విలేజ్‌గా మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాక పుస్తకాలు పెట్టేందుకు తమ ఇండ్లలో స్వచ్ఛందంగా చోటిచ్చారు అక్కడి వారు. ఇవికాక పాఠశాలలు, ఆలయాలు, గెస్ట్‌హౌస్‌లు, హోటళ్లు తదితర జనం గుమిగూడే ప్రదేశాలనూ ప్రభుత్వం ఎంపిక చేసింది. ప్రతి గ్రంథాలయాలనికి లక్ష రూపాయల గ్రాంట్, పుస్తకాలు పెట్టడానికి అవసరం అయ్యే అల్మరాలు, పుస్తకాల కోసం మరో 80 వేల రూపాయలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.
పాఠకులు కూర్చుని చదువు కోవడానికి చక్కని సోఫాలు, కుర్చీలు, టేబుళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక, ఊరిని పుస్తక గ్రామంగా తీర్చి దిద్దేందుకు 75 మంది కళాకారుల్ని తీసుకొని ఎక్కడెక్కడ ఏయే పుస్తకాలు పొందుపరచి ఉన్నాయో తెలిసేలా గ్రాఫిక్ బొమ్మల తరహాలో పెయింటింగులు వేయించారు అధికారులు. అదికాక ఆ ఊళ్లో పుస్తక పఠనం చేసే వారి కోసం మరో 25 హాట్స్పాట్లు ప్రత్యేకించారు. కవిత్వం, పండుగలు, చరిత్ర, ఆటోబయోగ్రఫీలు… ఇలా ఒక్కో చోట ఒక్కో రకం పుస్తకాలు ఉంటాయిక్కడ. మనం ఊళ్లో దిగాక మనకిష్టమైన పుస్తకాలు ఎక్కడున్నాయన్నది పెయింటింగుల ద్వారా తెలుసుకోవచ్చు. లేదా బ్రౌచర్లో సులభమైన మ్యాప్‌లు, రోడ్డు మీద అందంగా తీర్చి దిద్దిన సైన్ బోర్డుల ద్వారా అక్కడికి వెళ్లొచ్చు.
ప్రపంచంలోని తొలి పుస్తక గ్రామం ‘హే ఆన్ వే’ స్ఫూర్తితో దీన్ని మొదలు పెట్టారు. ఇక్కడ చర్చాగోష్ఠులు, వర్క్‌షాప్‌లు, ప్రదర్శనలు… ఇలా అనేకం జరుగుతుంటాయి. చుట్టుపక్కల ప్రదేశాలు చూసే అనేక మంది ఇక్కడికీ వచ్చి వెళుతుండటంతో గ్రామంలో పర్యటకుల తాకిడి పెరిగింది. భిలార్‌లో ఉండే స్ట్రాబెర్రీ తోటలను పర్యటకుల కోసం తెరుస్తారు. ఎవరైనా అందులోకి వెళ్లి నచ్చినన్ని పండ్లను తినొచ్చు.
ఈ గ్రామంలో ఓ అందమైన జలపాతమూ పర్యటకులను ఆకట్టుకుంటుంది. ఇక, ఇక్కడ అరుదైన గ్రంథాలూ నెలవై ఉండటం, వాటిని ఉచితంగా చదువుకునే వీలుండటంతో ఎంతోమంది రీసెర్చ్ల కోసమూ ఇక్కడికి వస్తుంట్నారు. ఇక్కడి ఇళ్లలో విడిది చేస్తారు. తక్కువ ఖరీదులోనే భోజన సదుపాయమూ పొందే అవకాశం కూడా ఉండటంతో పుస్తకాల పనిమీద వచ్చేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. భిలార్ విజయం స్ఫూర్తితో రాష్ట్రంలో ఇలాంటి మరో అయిదారు ఊళ్లను ఇలా బుక్ విలేజ్‌లుగా మారుస్తున్నారు. దీంతో మరింత మందికి పుస్తకాలను చేరువ చేసినట్టు అవుతుంది.
– పాసికంటి శంకర్, భీవండి