ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు..
ఎప్పుడు అనుకుంటే అప్పుడు..
కాదు కాదు ఇట్టమున్నప్పుడు..
అట్ల సుత గాదు..
పంటకెప్పుడు అక్కెరో గప్పుడు..
కాడెడ్ల బండి గట్టుకొని
ఇంటామెను ఎంటబెట్టుకుని
రామన్న భీమన్న అడే అంటే
ఎడ్లుఎరువుల దుకాణం కాడాగేవి…
ఉద్దెరో.. సద్దెరో..
షావుకారిని బతిలాడితే..
నోరు రమ్మనేది
నొసలు పొమ్మనేది
అనుమానమచ్చి చేయి
గద్వ కాడికి పోయేది..
కాదనలేక షావుకారి సరే అనేది
మాట తప్పద్దంటూ కోపంజేసేది
యెంటనే తల్కాయ ఊగేది
ఇంకేముంది…
బస్తవీపుకెక్కేది.. బండి లోడయ్యేది
ఝా.. అనుడే ఆల్ష్యం
బండి పొలం కాడుండేది..
బత్తాలు మడి ఒడ్డు మీద
దర్జాగా నిలబడితే… ఇంటామె
కుట్లిప్పి డబ్బల పోసేది
సూత్తిమనెవరకు నాల్గెకరాలు
ఖతం చేసేది..
ఒడ్డు మీదికెక్కి దమ్ముదీసేది
సైఫోన్ కింద చల్లటి నీళ్లతో
పెయ్యి కడిగేది..
సల్లగ పచ్చటి చెట్టు కింద
సాపుకుని కూసుంటే
సద్ది బువ్వకే ఆకలయ్యేది
పిల్ల గాలి ఒళ్లుకు తలుగుతుంటే
పొలం మంచిగున్నదన్న గర్వంతోచెయ్యి మీసం మీదుండేది..
నాభి సల్లవడ్డంక నవాబు కైన
జవాబిచ్చే ధైర్నముండేది..
పచ్చని పొలాన్ని చూసుకుంట
కాలు మీద కాలేసుకుని
కూని రాగాలు తీస్తూ
రంగయ్య పాటలు పాడేది..
అలాంటి నన్ను
ఒక్క బత్త యూరియా కోసం
చెప్పులరిగేలా తిరిగేట్టు..
శివరాత్రి జాగారాలు చేసేటట్టు…
ఆఖరికి దొరకకపోతే…
కాళ్లు పట్టుకునే బిచ్చగాన్ని
శేత్తిరి కదరా..