రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నది. మరి ఈ కాలంలో రాష్ర్టానికి ఏం జరిగింది? వారు చేసిన పనులేమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతకాల్సిన పని లేదు. తెలంగాణ వచ్చినంక పదేండ్లలో కన్పించని దృశ్యాలను నేడు చూస్తున్నాం. వినకూడని మాటలు వింటున్నాం. ఇదే కాంగ్రెస్ సాధించింది.
రైతుల సమస్యలే బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా. మునుపెన్నడూ లేని విధంగా రైతు సమస్యల గురించిన సోయి గత ప్రభుత్వానికి ఉన్నది. తమది రైతు ప్రభుత్వమని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ చెప్పుకొనేది. రైతే రాజని చెప్పింది. కానీ, ఆ రాజుకు నిత్యం గాయాలెట్లయ్యాయో, ఉరికొయ్యలకు ఎట్లా వేలాడారో అందరికీ తెలుసు. కేసీఆర్ సీఎం అయ్యాక ఈ కన్నీటి దృశ్యం మారిపోయింది. తెలంగాణ దు:ఖ జీవితపు కాన్వాస్‌పై పచ్చటి పైర్లు చిత్రాలయ్యాయి. బతుకుదెరువు కోసం బయట ప్రాంతాలకు వెళ్లిన బడుగు జీవులు తమ సొంత ఊళ్లకు సంతోషంగా చేరుకున్న దృశ్యాలు ఇంకా కండ్లముందు కదలాడుతున్నాయి. పాలమూరు కరువు జిల్లాకు తిరుగు వలసలు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ పాలనా కాలంలో తీసుకున్న చర్యల వల్ల యావత్ దేశం మన తెలంగాణకు బతుకుదెరువును వెతుక్కుంటూ వచ్చింది. వందల రకాల పనుల్లో లక్షలాది మంది పక్క రాష్ర్టాల ప్రజలు ఉపాధి పొందుతున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు అలరారాయి. వరుసగా ఎనిమిదేండ్ల పాటు తెలంగాణలో ఒక్క చెరువూ ఎండిపోలేదు. పైగా భరణి కార్తిలో సైతం అలుగులు పారాయి. సరిగ్గా 2014 జూన్‌కు ముందు రైతులు విత్తనాల కోసం, పురుగు మందుల కోసం కిలోమీటర్ల దూరం బారులుతీరారు. కేసీఆర్ స్వయంగా ఓ రైతు కాబట్టి, ఎరువులు, విత్తనాల సమస్య లేకుండా చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రైతులు పొలాల్లోనే ఉన్నారు. పాడిపంటల పనుల్లో తీరుబడి లేకుండా గడిపారు. కానీ, ఇప్పుడు అదను కాలంలో యూరియా కోసం రోజుల తరబడి చెప్పులు లైన్లలో పెట్టి నీరసించిపోతున్నారు. కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదేం కష్టకాలం దేవుడా అని గోస పడుతున్నారు.
రైతుల శ్రేయస్సు కోసం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. రైతుల గురించి, వారి సమస్యల గురించి పక్కా ప్రణాళికతో గత ప్రభుత్వం పనిచేసింది. ఏటా వ్యవసాయ ప్రణాళికను ఆరునెలల ముందుగానే సిద్ధం చేసేది. ఒక్క రైతు కూడా విత్తనాలు, ఎరువుల కోసం ఎదురుచూడొద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చేది. గంటలకు గంటలు, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి రైతు సమస్యల గురించి చర్చించేవారు. జిల్లాలవారీగా అధికారులకు సలహాలు, ఇవ్వడమే కాదు, తీసుకుని కూడా రైతు సమస్యలను పరిష్కరించారు. అందువల్లనే పదేండ్లలో మన రాష్ట్రం పంజాబ్, హర్యానాలతో పోటీపడేలా చేసింది గత ప్రభుత్వం. గతంలో ఆంధ్రప్రదేశ్‌ను అన్నపూర్ణగా చెప్పుకొనేవారు. కానీ, కేసీఆర్ సర్కార్ చరిత్రను తిరిగి రాసింది.
గోదావరి, కృష్ణా జలాలతో చెరువులు, కుంటలు నింపడంతో రోడ్లపై కిలోమీటర్ల కొద్ది ధాన్యపు రాశులు కన్పించాయి. తెలంగాణ జీవావరణమే మారిపోయింది. సబ్స్టేషన్ల ముట్టడి లేదు. రుణాల కోసం బ్యాంకుల ముందు ఆందోళనలు లేవు. లాఠీచార్జీలు లేవు. కరెంట్ ఆపాలని రైతులు ప్రభుత్వాన్ని కోరే పరిస్థితి. ఇదంతా మొన్నటి వరకు మన అందరి అనుభవంలో ఉన్నది.
ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఏ గ్రామానికి వెళ్లి చూసినా రైతుల గోసలే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సకాలంలో యూరియా ఇవ్వనందు వల్లనే తాము రైతులకు సరఫరా చేయలేకపోతున్నామని సంబంధిత శాఖ మంత్రి అంటున్నారు. రాష్ర్టానికి రావాల్సిన కోటా ఎప్పుడో పూర్తి చేశామని కేంద్రప్రభుత్వం చెప్తున్నది. రైతుల విషయంలో బీజేపీది ఎలాంటి వైఖరో ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి జరిగిన రైతుల ఆందోళనే చెప్తున్నది. అంతేకాదు, రైతులను కారుతో తొక్కించి చంపేసిన ఘటన కూడా ఇంకా దేశ ప్రజల హృదయాల్లోనే ఉంది. రైతులను నిలువునా ముంచి కొందరికే మేలు చేయాలన్న మోదీ పట్టుదలను రైతులు చిత్తు చేశారు.
కేవలం రైతుల గురించి ఆలోచించి, ఆచరించే ఏకైక పార్టీ బీఆర్ఎస్, ఏకైక నాయకుడు కేసీఆర్. పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలతో కేసీఆర్ రైతుల ఆత్మబంధువు అయ్యారు. ఈ విషయాల గురించి తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరికి ముందుచూపు లేదని, ప్రజల పట్ల నిర్దయగా ఉన్నారని చాలా సందర్భాల్లో రుజువవుతూనే ఉన్నది. కేసీఆర్‌పైనా, ఆయన ప్రభుత్వంపైనా నిందలేశారు. నిజాలపై నీళ్లు పోశారు. అయినా వాస్తవాలను ఎల్లకాలం ఎవ్వరూ కప్పి ఉంచలేరు. ఎవరి పని తీరు ఎలాంటిదో ఇప్పుడు ప్రజలకు అర్థమవుతున్నది. ఎవరు తమ మేలు కోరారో కూడా రైతులు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. రైతులకు మేలు జరగడమే బీఆర్ఎస్కు కావాల్సింది. చివరగా ఓ మాట. రైతులందరూ ముక్తకంఠంతో ఇప్పుడు చేస్తున్న డిమాండ్.. ‘యూరియా.. ఇంకెప్పుడయ్యా!