హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 22 : గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాని తీరుపై భగ్గుమంటున్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నియామకాలు చేపడుతామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి రెండున్నరేళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. దీంతో విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు జిల్లాలోని గ్రంథాలయాల్లో ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవంగా 11 వేల పోస్టులే భర్తీ చేశారని నిరుద్యోగులు స్పష్టం చేస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి చేయగా అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసిన కాంగ్రెస్ సర్కారు తన గొప్పగా చెప్పుకుంటున్నది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిసినా నేటికీ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు సర్కారు వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగుల ఎదురుచూపులు..
డీఎస్సీ, గ్రూప్-1లో కొన్ని పోస్టులు పెంచడం మినహా ప్రభుత్వం తీసుకున్న చర్యలేమీ లేవని నిరుద్యోగులు మండిపడుతున్నారు. జాబ్ క్యాలెండర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. గ్రూప్-1, 2, 3, 4, పోలీసు, టీచర్ వంటి వివిధ విభాగాల్లో సుమారు 50 వేల పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందంటున్నారు. గతంలో భర్తీ చేసినవాటితో పాటు, మిగిలిన బ్యాక్లాగ్, కొత్తగా గుర్తించిన పోస్టులతో కలిపి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లోనే పోలీసు శాఖలో నియామక ప్రక్రియ మొదలవ్వాలి. మేలో గ్రూప్-2, జూలైలో గ్రూప్-3 నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ నెలలో జారీ చేయాల్సిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వాయిదా పడింది. వీటిని మళ్లీ రీషెడ్యూల్ చేయనున్నారు. గురుకులాలు, సింగరేణి కాలరీస్, ఇంజినీరింగ్ విభాగాల్లో నియామకాలు చేపట్టాల్సి ఉంది.

Warangal1
కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతాం
మూడేళ్లుగా సర్కారు కొలువు కోసం ప్రిపేర్ అవుతున్నా. గత అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులతో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పింది. కానీ చేసిందేమీ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. గ్రూప్-1 పేపర్ తప్పుల తడకగా రావడంతో కష్టపడి చదివిన వారికి ఫలితం లేకుండా పోయింది. జీపీవో నోటిఫికేషన్ ఇస్తామని నిరుద్యోగులను ఊరించి పాత వీఆర్వో, వీఆర్ఏలకు నామమాత్రపు ఎగ్జామ్ పెట్టి 10 వేల జీపీవో పోస్టుల్లో నియమించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతాం.
– సురేశ్, భూపాలపల్లి
నట్టేట ముంచింది..
రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలి. డీఎస్సీ, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కోసం ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లవుతున్నా నేటికీ ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఎన్నో ఆశలతో కాంగ్రెస్‌ను గెలిపిస్తే నిరుద్యోగులను నట్టేట ముంచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్‌రెడ్డి ఇచ్చినట్లు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.
– జీ సాయితేజస్వి, నిరుద్యోగి
గత ప్రభుత్వమే నోటిఫికేషన్లు ఇచ్చింది
రాష్ట్రంలో ఏటా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లతోనే ఉద్యోగాలను భర్తీ చేసి చేతులు దులుపుకుంది. నిరుద్యోగులకు నెలకు రూ.4 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావొస్తున్నా ఒక్క నియామక ప్రక్రియ చేపట్టలేదు. జాబ్‌మేళాలు నిర్వహించి ప్రైవేటు రంగంలో కొద్దిపాటి ఉద్యోగాలు ఇస్తే సరిపోతుందా? ఇటీవల ప్రవేశపెట్టిన ‘రాజీవ్ యువ వికాసం’ పథకం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారు.
– దుగ్గెల తిరుపతి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి