కాగజ్నగర్, ఫిబ్రవరి 22: తునికాకు కట్ట ధర పది రూపాయలకు పెంచాలని ప్రభుత్వాన్ని టీఏజీఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పూసం సచిన్ డిమాండ్ చేశారు. కాగజ్నగర్ పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుమ్రం భీం జిల్లాలోని వ్యవసాయం తర్వాత రెండవ ప్రధాన పంటగా తునికాకు సేకరణ అని తెలిపారు. ఇక్కడి గ్రామాల్లో ప్రజలతో పాటు అటవీ ప్రాంతాల్లోని గిరిజనులు ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
దట్టమైన అడవిలోకి వెళ్లి అతి కష్టంతో తునికాకు సేకరిస్తే సరైన గిట్టుబాటు ధర లభించక గిరిజనులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి తునికాకు కట్టకు పది రూపాయల చొప్పున చెల్లించాలని కోరారు. అదే విధంగా మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లించాలని, కల్లెదారుల సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఏజీఎస్ జిల్లా కార్యదర్శి అశోక్, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ముంజం ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.