తెలంగాణ ముఖ్యమంత్రికి…!
నేను మే నెలలో రిటైర్ అయ్యాను. ఇంతవరకు నా జీపీఎఫ్ ఫైనల్ అమౌంట్, గ్రాట్యుటీ, కమిటేషన్ 40 శాతం అమౌంట్, 10 నెలల సరెండర్ అమౌంట్.. ఏ ఒక్కటీ రాలేదు. ఇవన్నీ నా కష్టార్జితం.
నేను ఏమైనా నా లోన్లు కట్టమన్నానా? నాకు ఉచితంగా ఇల్లు కట్టించమన్నానా? ఉచితంగా పెన్షన్ కావాలన్నానా? నా ఇంటికి ఉచితంగా కరెంట్ బిల్ కట్టమన్నానా? నాకు తక్కువ రేటుకు గ్యాస్ సిలిండర్ కావాలన్నానా? నా భూమిలో పంట పండించడానికి ఎకరానికి ఉచితంగా రూ.15,000 కావాలని అడిగానా? నా పొలానికి ఉచితంగా కరెంట్ కావాలన్నానా? ఉచితంగా మేకలు, గొర్రెలు, బర్రెలు, పందులు కావాలన్నానా? వీటిలో ఏదీ నాకు ఉచితంగా ఇవ్వలేదు.
నేను పన్నులు కట్టాను, ఎగ్గొట్టలేదు. నా సంపాదనంతా ప్రభుత్వ లెక్కే. నా పిల్లలకు స్కాలర్షిప్ లేదు. లక్షలు అప్పులు చేసి ఫీజులు కట్టి చదివించుకున్నాను. అప్పులు చేసి పిల్లలకు పెండ్లి చేశాను. నేను సైకిల్‌పై వెళ్లి నా కొడుకు చదివే ఇంజినీరింగ్ కాలేజీలో ఫీజు కడితే, కారులో వచ్చిన వ్యక్తి ఒక్క రూపాయి ఫీజు కట్టలేదు. నాకు తెల్ల కార్డు లేకపోవడమే అందుకు కారణం.చివరికి ఇల్లు కట్టుకుందామన్నా, అరెకరం పొలం కొనుక్కుందామన్నా డబ్బులు లేవు. నేను కష్టపడి రాత్రి, పగలు డ్యూటీలు చేశాను. నా జీవితంలో సగం రాత్రులు రాత్రి డ్యూటీలోనే గడిసిపోయాయి. ఎంతో కష్టపడి ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేశాను. జీవితమంతా కష్టపడ్డాను. నా కష్టార్జితంతో దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకపోతే ఎలా? చెప్పండి.
నిజంగా ఉచితాలకు ఎంతమంది అర్హులు. ఎంతయినా ఇచ్చుకోండి. మేం వద్దనలేదు. దయచేసి మావి మాకు ఇవ్వండి. మేం కూడా ఓట్లు వేశాం. మమ్ములను మనుషులుగా గుర్తించండి. పనికిరాని ప్రభుత్వం బానిసలుగా భావించకండి. మా మీద కూడా దయ చూపించండి. రిటైర్ కాబోయే ఉద్యోగులారా మీరూ ఆలోచించండి.