పరిగి, సెప్టెంబర్ 13 : సాయంత్రం చీకటి పడిన తర్వాత ఓ ఫర్టిలైజర్ దుకాణం యజమానికి సంబంధించిన గోదాం నుంచి ఆటోల్లో యూరియా బస్తాలు తరలించడం అనేక అనుమానాలకు తావిసున్నది. శనివారం ప రిగి పట్టణంలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రానికి 450 బస్తాలు, శ్రీలక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణానికి 100 బస్తాల యూరియా వచ్చింది. ఉదయం సమయంలో రైతులకు పోలీసుల సమక్షంలో టోకెన్లు అందజేసి ఆ యా దుకాణాల గోదాముల నుంచి యూరియా బస్తాలు పంపిణీ చేపట్టారు. శనివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో శ్రీలక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్కు సంబంధించిన గోదాం నుంచి ఆటోల్లో యూరియా బస్తాలను తరలించడం అనేక ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది. ఒక్కో ఆటోలో 5 బస్తాల చొప్పున ఇతర గ్రామాల రైతులకు యూరియా బస్తాలు పంపిస్తుండగా ఓ రైతు స్వయంగా వీడియో తీసి నిలదీయగా ఉదయం సమయంలో టో కెన్లు ఇచ్చారని, ఇపుడు తీసుకెళ్తున్నారని బుకాయించే ప్రయత్నం చేయడం గమనార్హం.
ఉదయం సమయంలో టోకెన్లు ఇస్తే రాత్రి సమయంలో యూరియా బస్తాల తరలింపు ఎందుకు చేపడుతున్నారని రైతులు మండిపడుతున్నారు. అందరూ చూస్తుండగానే పంపి ణీ చేయాల్సి ఉండగా రాత్రి సమయంలో ఎం దుకు పంపిణీ అని ప్రశ్నిస్తున్నారు. ఉదయం సమయంలో కొంత మందికి టోకెన్లు ఇచ్చి వచ్చిన స్టాక్ వరకు అయిపోయాయని నమ్మించి తమకు కావాల్సిన వారికి యూరియాను తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. రూ.400లకు ఒక బస్తా యూరియా చొప్పున ఇతర రైతులకు వ్యాపారులు విక్రయిస్తున్నారనే ఆరోపణల మధ్య సాయంత్రం చీకటి పడిన తర్వాత యూరియా బస్తాల తరలింపు ఈ ఆరోపణలకు మరింత బలం చేకూరుస్తున్నది.
యూరియా బస్తాల తరలింపును వీడియో తీసిన రైతు మండల వ్యవసాయాధికారి, జిల్లా అధికారులకు సైతం పంపించి ఫిర్యాదు చేశారు. సదరు దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయమై జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నంను వివరణ కోరగా ఈ అంశం తన దృష్టికి వచ్చిందని, శ్రీలక్ష్మీ సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ దుకాణం యజమానికి షోకాజ్ నోటీసు ఇవ్వాల్సిందిగా మండల వ్యవసాయాధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఈ అంశంపై విచారణ చేపట్టి నివేదికను అందించాల్సిందిగా సూచించామన్నారు. టోకెన్లు అందించిన వెంటనే ఎరువుల పంపిణీ చేపట్టాలని ఆయన సూచించారు.