నీలగిరి, సెప్టెంబర్ 13: సర్కార్ తీరుపై ట్రిపుల్ ఆర్ బాధితులు ఫైర్ అయ్యారు. మంత్రికి తమ బాధలు చెప్పుకొందామని వస్తే అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ట్రిపుల్ ఆర్కు సంబంధించి దక్షిణభాగం అలైన్మెంట్ వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15లోగా అభ్యంతరాలను తెలపాలని కోరుతూ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. గట్టుప్పల్ మండలం తేరట్పల్లికి చెందిన కొందరు ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులు నల్లగొండ పర్యటనలో ఉన్న జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని కలిసేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చారు.
స్థానిక గడియారం సెంటర్లోని ఇందిరాభవన్ వద్ద మంత్రిని కలిసి వినతిపత్రం ఇచ్చి వెళ్దామని ఎదురుచూస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాము ఎలాంటి ఆందోళన చేయడం లేదని, శాంతియుతంగా మంత్రికి వినతిపత్రం అందజేసి వెళ్తామని చెప్పినా వినకుండా అరెస్టు చేసేందుకు ప్రయత్నం చేశారు. వారిని బలవంతంగా ఈడ్చుకెళ్లి పోలీసు వాహనంలో పడేశారు.
ఈ క్రమంలో బాధితులకు పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. వారిని బలవంతంగా అరెస్టు చేసి నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించి మంత్రి పర్యటన ముగిసిన తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మొదటి అలైన్మెంట్ ప్రకారంగా రోడ్డు నిర్మించాలని, రెండో అలైన్మెంట్ను పక్కన పెట్టాలని మంత్రిని వేడుకుందామని వస్తే అరెస్టు చేయడం అన్యాయమని అన్నారు. గ్రామంలో అంతా సన్న చిన్నకారు రైతులే ఉన్నారని, ఎకరం నుంచి ఐదు ఎకరాలలోపు ఉన్నవారి భూములు మొత్తంగా పోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
216 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూముల మీదుగా రోడ్డు నిర్మాణం చేస్తే సారవంతమైన భూములు కోల్పోకుండా అక్కరకు రాని భూములు తీసుకుని రోడ్డు నిర్మాణం చేస్తే బాగుంటుందని సూచించారు. పరిహారం ఎకరాకు కేవలం రూ.10 లక్షలలోపు ఇస్తున్నారని, అక్కడ బహిరంగ మార్కెట్ విలువ రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుందని తెలిపారు. కానీ ప్రభుత్వ పరిహారంతో మరోచోట భూములు కొనే వీలు లేదని, ఉన్న జీవనాధారం కోల్పోయి కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.