కారేపల్లి, నవంబర్ 11 : ప్రభుత్వం తీసుకువచ్చిన “కాపస్ కిసాన్” మొబైల్ యాప్ రైతులకు మరింత పారదర్శకంగా, నేరుగా లాభదాయకంగా ఉండనుందని ఇల్లెందు వ్యవసాయ శాఖ అధికారి గ్రేడ్ 3 కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ పత్తి విక్రయానికి సంబంధించిన వివరాలను నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు. దీంతో మధ్యవర్తులకు చెక్ పెట్టి రైతులకు నేరుగా లాభం చేకూరే అవకాశం ఉంటుందన్నారు. మంగళవారం సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ లక్ష్మీ కొటేక్స్ జిన్నింగ్ మిల్ ప్రాంగణంలో పత్తి విక్రయాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సిసిఐ (CCI) కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ గత రెండేళ్లుగా సీసీఐ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రైతులకు న్యాయమైన ధరలు అందేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 1,150 మంది రైతుల నుండి మొత్తం 32,725.10 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,629 మంది రైతుల నుండి 43,293.45 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు.
పత్తి విక్రయానికి తీసుకురావడానికి ముందు తేమ శాతం 12 కంటే తక్కువగా ఉండేలా రైతులు చూసుకోవాలన్నారు. తక్కువ తేమ ఉన్న పత్తికి మంచి ధర లభిస్తుందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడినట్లు తెలిపారు. ఈ హెల్ప్ డెస్క్‌లు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రైతులకు సేవలు అందిస్తాయన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పారదర్శక విధానాలను సద్వినియోగం చేసుకోవాలని, మంచి నాణ్యత కలిగిన పత్తిని తక్కువ తేమతో సిసిఐ కేంద్రాలకు తీసుకువచ్చి అధిక లాభాలు పొందాలని రైతులకు సూచించారు.

Karepally : ‘కాపస్ కిసాన్’ యాప్‌తో రైతులకు లాభం