కట్టంగూర్, నవంబర్ 11 : సమాజంలో బాల్య వివాహాలు, శిశు విక్రయాలు చట్ట విరుద్దమని ఐసీడీఎస్ సీడీపీఓ అస్రం అంజు అన్నారు. మంగళవారం కట్టంగూర్ లోని కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలలో మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆశ్రిత స్వచ్చంద సంస్థ అధ్వర్యంలో బేటీ బచావో బేటి పడావో కార్యక్రమంలో భాగంగా బాల్య వివాహాలు, శిశు విక్రయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చదువుకునే వయస్సులో చదువు మీద మాత్రమే ఏకాగ్రత ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోగలమన్నారు. బాల్య వివాహాలతో అనారోగ్య సమస్యలు వస్తాయని. బాల్య వివాహాలను చేయడం, ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమన్నారు.
శిశు విక్రయాలు తీవ్రమైన నేరమని, ఎవరైనా శిశువులను విక్రయించేందుకు ప్రయత్నించినా, విక్రయించిన చట్టపరంగా చర్యలు ఉంటామని తెలిపారు. బాల్య వివాహాలు, శిశు విక్రయాలపై తల్లిదండ్రులు, విద్యార్థినులు అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థినులచే బాల్య వివాహాలు, శిశు విక్రయాలను అరికట్టాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజర్లు బూరుగు శారదారాణి, పద్మావతి, ఆశ్రిత స్వచ్ఛంద సంస్థ ఎన్జీఓ ఝూన్సీ, పాఠశాల ఎస్ఓ నీలాంబరి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.